కురులు దెబ్బతినకుండా!

ఆంధ్రజ్యోతి (14-10-2019): వెంట్రుకలను సొగసుగా, ఉంగరాల జుత్తులా మార్చడం కోసం హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌, హెయిర్‌ డ్రైయర్‌ వాడతాం. అయితే వీటి వల్ల కేశాలు రాలిపోవడం, రంగు మారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సాధనాలతో జుట్టును స్టయిల్‌గా మార్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమంటే...

స్ర్పే లేదా సీరమ్‌: హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌, హెయిర్‌ డ్రైయర్‌ నుంచి వచ్చే వేడి కురులను దెబ్బతీస్తుంది. వీటితో వెంట్రుకలను సొగసుగా మార్చుకునే ముందు వేడి నుంచి రక్షణనిచ్చే క్రీమ్‌ లేదా సీరమ్‌ రాసుకోవాలి. ఇది జుట్టు దెబ్బతినకుండా, రంగు మారకుండా చూస్తుంది.
 
సెరామిక్‌ రకం: మార్కెట్లో తక్కువ ధరకే హెయిర్‌ డ్రైయర్స్‌, హెయిర్‌ స్ట్రెయిటర్స్‌ దొరకుతాయి. అయితే వీటిలో స్టీల్‌తో చేసిన వాటి బదులు సిరామిక్‌తో చేసిన వాటినే కొనాలి. ఇవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. హెయిర్‌ డ్రైయర్ల నుంచి వచ్చే వేడిలో మార్పులు చేసుకునేందుకు హీట్‌ టూల్స్‌ వాడాలి. మీ కురులు సన్నగా ఉన్నట్లయితే తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది.
 
రెండుసార్లు వద్దు: హెయిర్‌ డ్రైయర్‌ లేదా హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌ ఒకసారి వాడిన చోట మళ్లీ వాడకూడదు. ఎందుకంటే రెండు సార్లు వేడికి గురవ్వడం వల్ల జుట్టు ఎక్కువగా దెబ్బతింటుంది. నెలకు లేదా వారినికి ఒకసారి హెయిర్‌ స్పాలో హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, సున్నితంగా మారతాయి.
 
హెయిర్‌ డ్రై: సాధ్యమైనంత వరకు వేడి అవసరం లేని హెయిర్‌ స్టయిల్స్‌ ట్రై చేయండి. తల స్నానం చేసిన ప్రతి సారి హెయిర్‌ డ్రయ్యర్‌తో జుట్టు ఆరబెట్టుకోవడం జుట్టుకు హాని చేస్తుంది. సహజంగా ఎండకు వెంట్రుకలు ఆరబెట్టుకోండి.