ఏ జుట్టుకు ఏ ఆయిల్‌?

ఆంధ్రజ్యోతి(22/09/15): తలకు నూనె పట్టించుకోవడం ఎప్పుడూ మంచిదే! వేడిని తగ్గిస్తుంది. జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తూ.. రాలకుండా కాపాడుతుంది. కుదుళ్లు గట్టిపడేలా చేస్తుంది నూనె. తలకు పట్టించుకునే అలాంటి మంచి నూనెలు కొన్ని..

ఉసిరి నూనె
జుట్టు కుదుళ్లకు ఉసిరి నూనె పడితే మంచిది. ఇందులోని విటమిన్‌ సి నేరుగా జుట్టుకు అందుతుంది. రాత్రి పడుకునే ముందు ఉసిరి నూనెను తలకు పట్టించుకుని.. మునివేళ్లతో.. సున్నితంగా మర్దనా చేసుకుంటే చక్కటి పలితం లభిస్తుంది. చుండ్రు, జుట్టురాలడం తగ్గుతాయి. తలనొప్పి  నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

అవకాడో ఆయిల్‌
సహజసిద్ధమైన నూనెకు ప్రసిద్ధి అవకాడో ఆయిల్‌. ఇందులో జుట్టుకు అవసరమయ్యే పోషకాలు అధికం. అమినో ఆసిడ్స్‌, ఫ్యాటీ ఆసిడ్స్‌, విటమిన్‌ ఎ, బి, డిలతోపాటు ఇ కూడా లభిస్తుంది.  తలకు మర్దనా చేసుకుంటే డీప్‌ కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లు గట్టి పడి.. నిగనిగలాడతాయి.

 

 

ఆలివ్‌

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. ఆలివ్‌ ఆయిల్‌లో ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆయిల్‌ను ఎంచుకోవాలి. ఇది జుట్టుకు చేసేంత మేలు మరే నూనె చేయదు. జుట్టు రాలకుండా బాగా అరికడుతుంది. చుండ్రుకు చక్కటి నివారణ మార్గం.

 

రోజ్‌మేరీ ఆయిల్‌ 
కొందరికి జుట్టు బాగానే ఉంటుంది. అయితే నిగనిగలాడదు. అలాంటి వారు రోజ్‌మేరీ ఆయిల్‌ను వాడితే ఆశించిన ఫలితం వస్తుంది. జుట్టు తక్కువగా పెరిగే వాళ్లు కూడా వాడొచ్చు. జుట్టు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను శరీరానికి అందిస్తుందీ నూనె.

స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌
జుట్టు వత్తుగా పెరగడానికి ఇది చక్కగా పనికొస్తుంది. వారానికి రెండు సార్లు నూనెను పట్టించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎండకు, చలికి వెళ్లినప్పుడు.. ఉప్పునీటితో స్నానం చేసినప్పుడు.. జుట్టు చిట్లిపోకుండా ఆల్మండ్‌ నూనె కాపాడుతుంది.