పొడి జుట్టుకు పరిష్కారమిలా..

27-01-2019: చలికాలంలో మాడు భాగం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమై, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి. శిరోజాల సంరక్షణ కోసం చర్మ నిపుణుడు గౌరాంగ్‌ కృష్ణ సూచిస్తున్న జాగ్రత్తలివి...
 
తల స్నానం: షాంపూ ఎక్కువగా వాడడం వల్ల వెంట్రుకల ఆరోగ్యానికి అవసరమైన నూనెలు తొలగిపోయి, మాడుభాగం మరింత పొడిబారిపోతుంది. రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. తక్కువ పీహెచ్‌, సోడియం, సల్ఫేట్స్‌ రహిత షాంపూను ఉపయోగించాలి. జుట్టును శుభ్రం చేసుకున్న తరువాత కండీషనర్‌ను వాడాలి.
 
ప్రొబయాటిక్స్‌, నీళ్లు: ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల చుండ్రు ఏర్పడుతుంది. ప్రొబయాటిక్స్‌ రోగనిరోధక శక్తిని పెంచి, ఫంగస్‌ను నిర్మూలిస్తాయి. రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగితే మాడు భాగం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకలు కూడా బాగా
పెరుగుతాయి.
 
హెయిర్‌ ఉత్పత్తులు: కేశాల స్టయిలింగ్‌ కోసం ఉపయోగించే క్రీమ్స్‌, కలర్స్‌ జుట్టుకు తేమ అందకుండా చేస్తాయి. దీంతో వెంట్రుకలకు హాని జరుగుతుంది. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది.
 
నూనెతో మర్ధన: కేశాలకు తేమనందించి, వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు జట్టుకు చక్కగా నూనె రాసుకొని మర్ధన చేసుకోవాలి. కొబ్బరి, ఆలివ్‌, నువ్వులు, ఆముదం, లావెండర్‌ నూనెలతో వెంట్రుకలకు మసాజ్‌ చేసుకుంటే కురులు నిగనిగలాడుతాయి.