పేను కొరుకుడుకు పెద్ద మందు

ఆంధ్రజ్యోతి: కొంతమంది పెద్దల్లోను, పిల్లల్లోనూ తరచుగా తలపై అక్కడక్కడా జుట్టు ఊడిపోయి గుండ్రని ఆకారంలో నున్నని మచ్చలు చూస్తూంటాం. ఆధునిక వైద్యులు ఈ వ్యాధిని ‘‘అలోపేషియా ఏరియేటా’’ అని అంటుంటారు. దీన్ని ఆయుర్వేదంలో ‘‘ఇంద్రలుప్తవ్యాధి’’ అని, ‘‘ఖాలిత్య’’మని పిలుస్తారు. ముఖ్యంగా మానసిక ఆందోళనలు అనవసరమైన భయాలు, ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. అంతే కాకుండా ఒకరకమైన వ్యాధి కారక క్రిముల వల్ల కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశముంది. అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధిని ‘‘పేనుకొరుకుడు’’ వ్యాధిగా పిలవటం జరుగుతోంది. నిజానికి ఈ వ్యాధి పేను కొరకటం వల్ల రాదని తెలుసుకోవాలి. వ్యాధి తీవ్ర దశలో గడ్డం, కనురెప్పలు, కనుబొమ్మలు ఇతర శరీరభాగాల్లో కూడా ఈ వ్యాధి సోకి అక్కడ కూడా జుట్టు ఊడిపోయి అందవికారాన్ని కలిగిస్తుంది. ఈ వ్యాధి వల్ల నలుగురిలోకి వెళ్లలేని మానసిక బలహీనత ఎదురౌతుంది. అంతేగానీ ఈ వ్యాధి వల్ల ఇతర శారీరక నష్టాలేమీ ఉండవు. ఇక ఈ వ్యాధి ప్రారంభంలోనే తగిన మూలికా చికిత్సలతో తగ్గించుకోవచ్చు. అలాంటి సులభ మూలికా చికిత్సల్ని తెల్సుకుందాం.
ప్రతిరోజూ ఉదయాన్నే గుంటకలగర ఆకుల చిక్కని రసాన్ని జుట్టు లేని ప్రాంతంలో కొంతసేపు మసాజ్‌ చేసి గంట తర్వాత తలస్నానం చేయండి. ఒక టీ స్పూను ఈ ఆకు పౌడరును తగినంత తేనెలో కలిపి రోజూ ఉదయం, రాత్రి భోజనం ముందు లోపలికి వాడుతుండాలి.
నల్ల ఆవు మూత్రంతో మందార పువ్వులను మెత్తగా నూరి జుట్టులేని ప్రాంతంలో రాస్తుంటే జుట్టు త్వరగా వస్తుంది.
వేప గింజల నుండి తీసిన స్వచ్ఛమైన వేపనూనెను రోజూ ఉదయం, రాత్రి చల్లటి వేళల్లో మూడు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లో పోసి పీల్చుతూ, ఆవు పాలతో భోజనం చేస్తుంటే ఈ వ్యాధి ఎంత తీవ్ర స్థితిలో ఉన్నా తగ్గిపోతుంది.
పెద్ద నేపాళ గింజను తేనెలో అరగదీసి మచ్చలపై మధ్యాహ్నం పూట రాసుకొని ఆరబెట్టి కడగకుండా రాత్రి పడుకొని ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే ప్రారంభంలో కొద్దిగా మంట, పొక్కులు వచ్చి త్వరగా జుట్టు వస్తుంది. జుత్తు ఉన్న ప్రదేశాల్లో ఈ మందు వేయకండి.
నిమ్మగింజలను, మిర్యాలను సమభాగాలుగా కలిపి నీటిలో మెత్తగా నూరి జుట్టులేని ప్రాంతాల్లో రాయండి. జుట్టు త్వరగా వస్తుంది.
నల్ల ఉమ్మెత్త ఆకు చిక్కని రసాన్ని రాసినా పై ఫలితాలు ఉంటాయి.
 
 
 డాక్టర్‌ కందమూరి
ఆయుర్విజ్ఞాన కేంద్రం