ముల్తానీ మట్టితో కురుల సోయగం

ఆంధ్రజ్యోతి: ముల్తానీ మట్టిని హెయిర్‌ ప్యాక్‌లా వాడితే జుట్టుకి సంబంధించిన బోలెడు సమస్యల నుంచి బయటపడొచ్చు. మార్కెట్‌లో లభించే హెయిర్‌కేర్‌ ఉత్పత్తులకంటే ముల్తానీ మట్టి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అయితే అందుకు కొంచెం ఓపిక, మరికొంచెం సమయం అవసరం. జుట్టు ఊడకుండా, చిట్లిపోకుండా నిగనిగలాడుతూ అందంగా తయారవుతుందంటే ఆ మాత్రం ఓపిక ఉండదా అంటున్నారా. అయితే ఈ హెయిర్‌ ప్యాక్‌లు మీ కోసమే...
 
డ్రై హెయిర్‌: జుట్టుకి నువ్వుల నూనె రాసుకున్న గంట తరువాత ముల్తానీ మట్టి ప్యాక్‌ను రాయాలి. ఈ ప్యాక్‌ తయారు చేసుకునేందుకు నాలుగు టీస్పూన్ల ముల్తానీ మట్టి, అరకప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసం, రెండు టీస్పూన్ల తేనె కావాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకోవాలి. కాసేపటి తరువాత షాంపూతో తలస్నానం చేసి, కండిషర్‌ రాసుకోవాలి.
 
ఆయిలీ హెయిర్‌: ముల్తానీ మట్టిని నీళ్లలో వేసి నాలుగు గంటలు నానబెట్టాలి. ఇంకో అరగంటలో తలకు రాసుకుంటారనగా నానబెట్టిన ముల్తానీ మట్టిలో ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్ల రీటా పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటా రాసి మర్దనా చేసిన పదినిమిషాల తరువాత కడిగేయాలి.
 
చిట్లిన జుట్టుకు: రాత్రి నిద్రపోయేముందు జుట్టుకి ఆలివ్‌ నూనె రాసి మర్దనా చేయాలి. ఉదయం లేచాక వేడినీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టాలి. ఒక గంట తరువాత పెరుగులో నానబెట్టిన ముల్తానీ మట్టి మిశ్రమంతో జుట్టుకి రాసుకోవాలి. ఆ తరువాత శుభ్రంగా నీళ్లతో కడిగేయాలి. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేసి కండిషనర్‌ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
 

స్ర్టెయిట్‌ హెయిర్‌కు: ఒక కప్పు ముల్తానీ మట్టిలో ఐదు టీస్పూన్ల బియ్యప్పిండి, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని కాస్త జారుగా కలపాలి. ఈ ప్యాక్‌ను మాడుకి, జుట్టుకి రాసుకోవాలి.

చుండ్రు పోగొట్టేందుకు: ఐదు టీస్పూన్ల ముల్తానీ మట్టి,  మూడు టీస్పూన్ల మెంతులు, ఒక టీస్పూన్‌ నిమ్మరసాలు కావాలి. మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటిరోజు ఉదయం మెత్తగా మిక్సీలో పట్టాలి. తరువాత ఇందులో ముల్తానీ మట్టి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసుకుని తలకు తుండు చుట్టుకుని ఒక గంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఒకవేళ షాంపూ వాడాల్సొస్తే మైల్డ్‌ షాంపూ మాత్రమే వాడాలి. షాంపూ చేశాక కండిషనర్‌ వాడడం మర్చిపోవద్దు.

రాలే జుట్టుకు: ఐదు టీస్పూన్ల ముల్తానీ మట్టి, రెండు టీస్పూన్ల  పెరుగు, ఒకటీస్పూను నల్ల మిరియాల పొడి కావాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఇరవై నిమిషాల తరువాత మాడుకి రాయాలి. అరగంట తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. నెలరోజులు క్రమంతప్పకుండా ప్రతిరోజూ ఈ ప్యాక్‌ వాడి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.