‘కండిషనర్‌’ ఇలా ఉపయోగిద్దాం

ఆంధ్రజ్యోతి(15/05/15): వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే వాటిని క్రమంతప్పక శుభ్రం చేయటంతోపాటు కండిషనింగ్‌ కూడా చేస్తూ ఉండాలి. కండిషనర్‌ అప్లై చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
వెంట్రుకల కుదుళ్లకు కాదు: కండిషనర్‌ను వెంట్రుకల కుదుళ్లకు కాకుండా వెంట్రుకలకు మాత్రమే పట్టించాలి. స్కాల్ప్‌కు కండిషనర్‌ పట్టిస్తే అక్కడ నూనె తయారై వెంట్రుకలు జిడ్డుగా తయారవటంతోపాటు చుండ్రు సమస్య కూడా తలెత్తుతుంది. దాంతో దురద, జుట్టు రాలే సమస్యలు మొదలవుతాయి.

రంగు వేసిన జుట్టుకు: రంగు వేసిన లేదా పొడి వెంట్రుకలైతే కండిషనర్‌ను నేరుగా మాడుకే పట్టించటం మేలు. నీటి తాకిడికి జుట్టుకు వేసిన రంగు తొలగిపోకుండా ఉండాలన్నా రంగు వెంట్రుకలకు అంటుకుని ఉండాలన్నా కండిషనర్‌ను కుదుళ్లకే పట్టించాలి. 

షాంపూ ముందు: వెంట్రుకలు పల్చగా, బలహీనంగా ఉంటే షాంపూ చేయటానికి ముందే కండిషనర్‌ అప్లై చేయాలి. ఇలా చేస్తే షాంపూ చేసిన తర్వాత కూడా కొంత కండిషనర్‌ వెంట్రుకల మీద నిలిచి ఉంటుంది. దాంతో జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. వెంట్రుకలు చిట్లకుండా ఉండటానికి ఉత్తమమైన మార్గం కూడా ఇదే!

ఎప్పుడైనా, ఎక్కడైనా: షాంపూ చేసినప్పుడే కండిషనర్‌ అప్లై చేయాలనే రూలేం లేదు. జుట్టు కాంతులీనాలన్నా, మృదువుగా కనిపించాలన్నా షాంపూ చేయకుండా నేరుగా కండిషనర్‌ అప్లై చేయవచ్చు. తరచుగా షాంపూ ఉపయోగించటం వల్ల వెంట్రుకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమనుకున్నప్పుడు నేరుగా కండిషనర్‌నే ఉపయోగించవచ్చు.

లేబుల్‌ చదవండి: కండిషనర్‌ కొనేటప్పుడు దాని మీదున్న లేబుల్‌ తప్పకుండా చదవాలి. దాన్లో సిలికాన్‌ ఉపయోగించారో లేదో తెలుసుకోవాలి. సిలికాన్‌ లేని కండిషనర్‌నే కొనాలి. సిలికాన్‌ వల్ల వెంట్రుకల మొదళ్లు చిట్లుతాయి. అలాగే వెంట్రుకల సహజసిద్ధ నూనెలను సిలికాన్‌ తొలగిస్తుంది.

ఆరిన  తర్వాతే కండిషనర్‌: సాధారణంగా షాంపూ చేసిన వెంటనే కండిషనర్‌ అప్లై చేస్తూ ఉంటాం. కానీ ఇలా చేయటం వల్ల తిరిగి వెంట్రుకలను కడిగినప్పుడు కండిషనర్‌ మొత్తం తొలగిపోతుంది. ఇలాకాకుండా కండిషనర్‌ను వెంట్రుకలు పీల్చుకోవాలంటే తలస్నానం చేసిన తర్వాత టవల్‌తో వెంట్రుకల తడిని తొలగించాకే కండిషనర్‌ అప్లై చేయాలి. 

రసాయనాలు లేని హెన్నా: హెన్నా వెంట్రుకలకు ఉత్తమమైన కండిషనర్‌ అని మీ నమ్మకమైతే ఎలాంటి రసాయనాలు లేని హెన్నానే వాడండి. ఇందుకోసం ప్యాకేజ్‌డ్‌ హెన్నా బదులుగా ఇంట్లో తయారుచేసుకున్న హెన్నానే ఉపయోగించటం మేలు.