చుండ్రు నుంచి విముక్తి!

ఆంధ్రజ్యోతి (19-11-2019): చుండ్రు రెండు రకాలు. వాటిల్లో వాతం కారణంగా వచ్చే పొడి చుండ్రు ఒకరకం. ఈ చుండ్రు పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. దీనికి వైద్యంగా... మూడు చెంచాల త్రిఫల చూర్ణాన్ని ఒక లీటరు నీళ్లల్లో వేసి మరిగించాలి. కషాయం 800 మి. లీటర్లు మిగిలే దాకా కాచి చల్లార్చాలి.. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కషాయంతో తలను శుభ్రపరచాలి. వారానికి ఒకటి రెండు సార్లయినా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ‘దూర్వాది కేరం’ అనే తైలాన్ని రోజుకు ఒకసారి చొప్పున వారానికి 4 రోజులైనా వాడాలి. ఇలా రెండు మాసాల పాటు చేయాలి. దీనికి తోడు పావు చెంచా తులసి పొడిని ఉదయం, పావు చెంచా పొడిని రాత్రి తీసుకోవాలి. దీనికి కాల నియమం ఏమీలేదు. ఎప్పుడైనా వేసుకోవచ్చు.
 
కఫం కారణంగా వచ్చే ఫంగస్‌ చుండ్రు మరో రకం. ఇందులోనూ పొడి రాలినా, కపాలమంతా జిడ్డుగా ఉంటుంది. ఒకరోజు స్నానం చేయకపోయినా మట్టిమట్టిగా అనిపిస్తుంది. వీరు ‘వెట్పలా తైలం’ తలకు పట్టించి, గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి మూడు రోజులైనా ఇలా చేయాలి. ఆ తర్వాత ‘ఖదిరారిష్టం’ పొడిని 3 చెంచాలు ఉదయం, 3 చెంచాలు రాత్రికి భోజనం తర్వాత వేసుకోవాలి. ఇలా నెలరోజులు కొనసాగించాలి.
 
ఈ రెండు రకాల చుండ్రుల్లోనూ వాడాల్సిన మరో వైద్యం....
100 గ్రాముల ఉసిరి పొడి, 50 గ్రాముల గుంటగలగర ఆకు పొడి, 50 గ్రాముల కుంకుడుకాయ పొడి, రెండు చెంచాల వేపనూనెలను కలిపి వేడినీళ్లతో పేస్ట్‌లా తయారు చేసుకుని, వెంట్రుకలకు ప్యాక్‌లా వేసుకోవాలి.. గంట తర్వాత కడిగేయాలి. వారానికి ఒకరోజైనా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- డాక్టర్‌ డి. ప్రశాంత్‌ కుమార్‌, ఆయుర్వేద నిపుణులు