జుట్టు రాలకుండా...

19-02-2019: జుట్టు రాలడం సహజం. కానీ, రోజుకు 100కు మించి వెంట్రుకలు రాలుతుంటే సమస్యగానే భావించాలి. వెంట్రుకలు అకారణంగా రాలవు. అందుకు మూల కారణం కచ్చితంగా ఉంటుంది. దాన్ని కనిపెట్టి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతేగానీ తోచిన సౌందర్య చిట్కాలు పాటిస్తూ సమయం వృథా చేయకూ డదు. వెంట్రుకలు విపరీతంగా రాలడానికి కారణాలు ఏంటంటే....
 
వేడి: వేడి వల్ల కూడా జుట్టు రాలుతుంది. వేడి వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. వేడి గాలితో బ్లో చేయడం వల్ల వెంట్రుకలు చిట్టుతాయి. స్ర్టెయిటెనింగ్‌ చేయడం, వంకీలు తిప్పే కర్లర్లు వాడకం వల్ల కూడా వెంట్రుకలు పాడవుతాయి. కాబట్టి ఎంతో అరుదుగా తప్ప ఈ పనులు చేయకూడదు.
 
రసాయన చికిత్సలు: కెమికల్‌ కర్లింగ్‌, పర్మనెంట్‌ స్ట్రయిటెనింగ్‌ వెంట్రుకలకు, కుదుళ్లకు ప్రమాదకరం. వంకీలు తిరగడం కోసం, లేదా స్ట్రయిట్‌గా మారడం కోసం చేసే రసాయన చికిత్సల ఫలితంగా వెంట్రుకల బాండ్స్‌ దెబ్బతింటాయి. దాంతో నిర్జీవంగా తయారై క్రమేపీ రాలిపోతాయి. కాబట్టి ఈ చికిత్సలకు దూరంగా ఉండాలి.
 
రంగులు: హెయిర్‌ డై తరచుగా వాడినా వెంట్రుకలు ఊడడం పెరుగుతుంది. డైలలోని రసాయనాలు వెంట్రుకలకు హాని కలిగిస్తాయి. కాబట్టి 4 లేదా 6 వారాలకు ఒకసారి మాత్రమే డైలను వాడాలి.
 
పోషకాహారలోపం: జంక్‌ ఫుడ్‌, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం వెంట్రుకలపై పడుతుంది. కాబట్టి వాటికి బదులుగా తాజా ఆకుకూరలు, పళ్లు, రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
 
అనారోగ్యం: అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా హెయిర్‌ఫాల్‌ తగ్గకపోతే అందుకు కారణం బయల్పడకుండా ఉండిపోయిన అంతర్గత అనారోగ్యం కావచ్చు. కాబట్టి వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోండి.