హెల్దీ హెయిర్‌ కోసం...

ఆంధ్రజ్యోతి(06/10/14): సూర్యరశ్మి, తేమ, క్లోరిన్‌ కలిపిన నీరు, డ్రైయింగ్‌, రసాయనాల ప్రభావం మూలంగా వెంట్రుకలు పొడిబారి, జీవం కోల్పోతూ ఉంటాయి. అలాంటప్పుడు జుట్టుకు చికిత్స చేయకుండా వదిలేస్తే చిట్లిపోయి, రాలిపోతాయి కూడా! కాబట్టి వెంట్రుకల ఆరోగ్యం కోసం నిర్దేశించిన చికిత్సలను క్రమం తప్పక తీసుకోవాలి. 
కెరాటిన్‌ చికిత్స
వెంట్రుకలు పొడిగా తయారై ఎంత దువ్వినా అణగకుండా పైకి లేస్తూ ఉంటాయి. పోషకాలు లోపిస్తే ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకు పరిష్కారం వెంట్రుకలకు తగిన పోషకాలు అందించటమే! ఇందుకోసం పవర్‌ ప్రొటీన్‌ కెరటిన్‌ చికిత్స తీసుకోవాలి. వెంట్రుకల స్థితి, తత్వం, డ్యామేజీ ఆధారంగా చికిత్సకు తీసుకోవలసిన సెషన్స్‌ అంచనా వేస్తారు. వెంట్రుకలను వంపులు లేకుండా స్ట్రయిట్‌గా, పట్టుకుచ్చులా మెత్తగా మార్చటమే కెరటిన్‌ చికిత్స ప్రధమ ఉద్దేశం. ఈ ట్రీట్‌మెంట్‌లో మొదట జుట్టును షాంపూతో శుభ్రం చేసి తడి ఆరాక కెరటిన్‌ సొల్యూషన్‌ను పట్టించి దువ్వుతారు. కెరటిన్‌ వెంట్రుకలకు పూర్తిగా పట్టడానికి 20 నిమిషాలు పడుతుంది. తర్వాత వెంట్రుకలను బ్లో డ్రై చేసి ఫ్లాట్‌ ఐరన్‌ చేస్తారు. ఈ చికిత్సతో వంపులు తిరిగిన వెంట్రుకలు స్ట్రయిట్‌గా, మెత్తగా తయారవుతాయి. గాజులాంటి మెరుపును కూడా సంతరించుకుంటాయి. ఈ చికిత్సను ఒకసారి తీసుకుంటే ఆ ఫలితం 3 నుంచి 4 నెలలపాటు ఉంటుంది. ఇంకా ఎక్కువకాలం ఉండాలనుకుంటే తలస్నానానికి సల్ఫేట్‌ లేని షాంపూ వాడాలి. 
మొరాకన్‌ ఆయిల్‌ ట్రీట్‌మెంట్‌
డ్యామేజీ అయిన వెంట్రుకలకు ఈ చికిత్స చక్కటి పరిష్కారం. ఈ చికిత్సలో జిడ్డులేని మొరాకన్‌ ఆర్గాన్‌ నూనెను ఉపయోగిస్తారు. గోరు వెచ్చని ఆర్గాన్‌ నూనెను వెంట్రుకల కుదుళ్లకు పట్టించి ఆవిరి పడతారు. ఇలా చేయటం వల్ల నూనెలోని పోషకాలు కుదుళ్లలోకి ఇంకుతాయి. దాంతో వెంట్రుకలు బలపడి ఆరోగ్యవంతంగా తయారవుతాయి. జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
 
ఓజోన్‌ హై ఫ్రీక్వెన్సీ ట్రీట్‌మెంట్‌
ఈ చికిత్స వెంట్రుకల కుదుళ్లలో పేరుకున్న నిర్జీవ చర్మ కణాలను తొలగించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దాంతో వెంట్రుకల కుదుళ్లు బలపడి జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. అధిక చుండ్రు సమస్య కూడా ఈ చికిత్సతో పరిష్కారమవుతుంది. ఓజోన్‌ చికిత్సలో ఒక గాజు ఎలకో్ట్రడ్‌ ద్వారా జుట్టు కుదుళ్లలోకి హై ఫ్రీక్వెన్సీలో ఉండే తక్కువ పరిమాణం విద్యుత్తును ప్రసరింపజేస్తారు. హై ఫ్రీక్వెన్సీ విద్యుత్తు గాలిలో ఉండే ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మారుస్తుంది. ఈ చికిత్స కోసం గాజు దువ్వెనలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. వెంట్రుకల కుదుళ్లు భరించలగలిగేంత విద్యుత్తును మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి షాక్‌ కొట్టే భయం ఉండదు. 15 నిమిషాలపాటు సాగే ఈ చికిత్స వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర పేరుకున్న నిర్జీవ చర్మ కణాలు తొలగిపోయి కుదుళ్ల దగ్గర రక్త ప్రసరణ మెరుగవుతుంది.
రిఫైనింగ్‌ హెయిర్‌ స్పా
ప్రతి ఒక్కరినీ వేధించే సాధారణ జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు పూర్తిగా వదిలిపోకుండా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా జుట్టుకు రిఫైనింగ్‌ హెయిర్‌ స్పా చికిత్స తీసుకోవాలి. ఈ చికిత్సలో చుండ్రును సమూలంగా నిర్మూలించటం కోసం ‘ఎమ్‌ ఫ్యూల్‌’ అనే ఒక పిల్‌ను ఉపయోగిస్తారు. చుండ్రు తీవ్రత ఆధారంగా రిఫైనింగ్‌ సెషన్స్‌ను అంచనా వేస్తారు.