హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ టిప్స్‌

ఆంధ్రజ్యోతి(15/07/15): వంకీల జుట్టు సరిచేయటం కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. వెంట్రుకలను పొడిబార్చి నిర్జీవంగా తయారుచేసే హెయిర్‌ స్ట్రెయిటెనర్స్‌ బదులుగా సహజ పద్ధతులతోనే వంకీల జుట్టును సరిచేయొచ్చు. ఆ చిట్కాలేవో తెలుసుకుందామా!

తడి జుట్టు పూర్తిగా ఆరేవరకూ ప్రతి 5 నిమిషాలకోసారి బ్రష్‌ చేస్తూ ఉండాలి. ఇందుకోసం జుట్టును పాయలుగా విడదీసి తల నుంచి కింది వరకూ నిటారుగా దువ్వుతూ ఉండాలి. ఇలా ఫ్యాన్‌ ముందు కూర్చుని కూడా చేయొచ్చు.

జుట్టు తడిగా ఉన్నప్పుడే ఎడమవైపు జుట్టును కుడివైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. అలాగే  కుడివైపు వెంట్రుకలను ఎడమవైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. ఈ ముడులకు స్కార్ఫ్‌ చుట్టి పూర్తిగా ఆరనివ్వాలి.

తడి జుట్టును పాయలుగా విడదీసి రోలర్స్‌ తీసుకుని వాటికి వెంట్రుకలను చుట్టి తల దగ్గరికి రోల్‌ చేసి పిన్స్‌ పెట్టాలి. ఆరిపోయాక జుట్టు స్ట్రెయిట్‌గా తయారవుతుంది.

రాత్రి పూట తడి జుట్టుతో రెండు పోనీ టెయిల్స్‌ వేసుకోవాలి. ఈ పోనీ టెయిల్స్‌కు అంగుళానికొకటి చొప్పున ఎలాస్టిక్‌ బ్యాండ్స్‌ వేయాలి. పొద్దునకల్లా జుట్టు స్ట్రెయిట్‌గా తయారవుతుంది.

తడి జుట్టును తాడులా తిప్పి తల వెనక ముడి వేయాలి. పూర్తిగా ఆరాక బ్రష్‌ చేసుకోవాలి.