కురులు సమ్మోహనంగా...

28-10-2019: నల్లటి కురులు ముఖానికి ఇచ్చే నిండుదనం, అందం వేరు. అందుకే శిరోజాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు మహిళలు. కురులు, బలంగా, సమ్మోహనంగా ఉండేందుకు సౌందర్య నిపుణులు కొన్ని టిప్స్‌ చెబుతున్నారు. అవేమిటంటే..
జుట్టు స్ట్రయిటుగా ఉండేందుకు హీట్‌ టూల్స్‌ అవసరం లేకుండా డై మాస్కును ఉపయోగించవచ్చు. ఈ హెయిర్‌ మాస్కు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫ్యాట్‌ బాగా ఉన్న కొబ్బరిపాలు ఒక కప్పు, వాసనలేని జిలెటిన్‌ పొడి రెండు టేబుల్‌స్పూన్లు, కార్న్‌ స్టార్చ్‌ రెండు టేబుల్‌స్పూన్లు, అడివి తేనె రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ ఐదు చుక్కలు వేసి పేస్టులా చేసి తలకు రాసుకుంటే శిరోజాలు స్ట్రయిటెన్‌ అవుతాయి.
వేడి నీళ్లతో తల రుద్దుకుంటే వెంట్రుకల్లో చేరిన మురికంతా పోతుంది. అయితే చివర్లో మాత్రం మర్చిపోకుండా చల్లటి నీళ్లతో వెంట్రుకలను బాగా శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మెరుపులు చిందించడమే కాదు మాయిశ్చర్‌ను వాటికి అందిస్తాయి. తరచూ వేడినీళ్లతో తల రుద్దుకోవడం వల్ల శిరోజాల మెరుపు, రంగు తగ్గిపోతాయి.
జుట్టు పెరగడానికి వంటింటి సామగ్రితోనే ఆరోగ్యకరమైన నూనెను తయారుచేసుకోవచ్చు. కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, నువ్వులనూనె, ఆవ నూనె, ఆముదం, బాదం నూనె, రెండు ఉసిరికాయ ముక్కలు, రెండు గుప్పెళ్ల కరివేపాకు, బేబీ ఉల్లిపాయలు అన్నింటినీ కలిపి చేసిన నూనె జుట్టుకు రాసుకుంటే జుత్తు బాగా పెరుగుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండడంలో తినే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. జుట్టు పట్టులా మెరవాలంటే నార్మల్‌ జుట్టు ఉన్న మహిళలు చేప, చికెన్‌, పప్పు, మొలకలు బాగా తింటే మంచిది. బిరుసు వెంట్రుకలు ఉన్నవాళ్లు పచ్చికూరగాయలు, దంపుడు బియ్యం, అరటిపళ్లు, నట్స్‌, విటమిన్‌-ఇ క్యాప్సూల్స్‌ తీసుకోవాలి. ఇక జిడ్డు వెంట్రుకలు ఉన్నవాళ్లు ఆకుకూరలు, సలాడ్లు, తాజా పండ్లు, పెరుగు బాగా తినాలి.
తల దురదపెట్టకుండా ఉండాలంటే తాజా నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌, నీళ్లు ఒక్కొక్కటీ రెండేసి స్పూన్లు చొప్పున తీసుకుని ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.
సూర్యకాంతితో జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే.. అరకప్పు తేనె, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ మిశ్రమాన్ని మాడుపై మర్దనా చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.
చుండ్రుతో బాధపడేవారు రెండు భాగాల బ్రౌన్‌షుగర్‌, ఒక భాగం హెయిర్‌ కండిషనర్‌ కొలతగా తీసుకుని ఆ మిశ్రమంతో మాడుపై సున్నితంగా మసాజ్‌ చేసుకుని తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది.