బలమైన శిరోజాల కోసం..

ఆంధ్రజ్యోతి, 22-01-2019: శిరోజాలు పట్టులా మెరిస్తే అందంగా కనిపిస్తాం. అయితే వాటి కుదుళ్లు బలంగా ఉండాలి. నల్లగా నిగనిగలాడే శిరోజాల కోసం వంటింట్లో చాలా పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వాటితో కొన్ని చిట్కాలు...

జుట్టు బలంగా, ఆరోగ్యంగా నాలుగుకాలాల పాటు ఉండాలంటే పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. సాధారణ వెంట్రుకలు ఉండేవాళ్లు చేపలు, చికెన్‌, పప్పులు, మొలకలు బాగా తినాలి. బిరుసు వెంట్రుకలు ఉన్నవారు పచ్చికూరగాయలు, పప్పు ధాన్యాలు, దంపుడు బియ్యం, నట్స్‌, విటమిన్‌-ఇ కాప్యూల్స్‌ తీసుకోవాలి. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు ఆకుకూరలు, సలాడ్స్‌, తాజా పళ్లు, పెరుగు తినాలి.
 
వెంట్రుకలు అందంగా ఉండాలంటే మనం వాడే షాంపూ విషయంలోనూ జాగ్రత్తపడాలి. పొడి జుట్టులోని ఆయిల్స్‌ పోకుండా మైల్డ్‌ షాంపూలు వాడాలి. పొడి జుట్టుకు ఎక్కువ షాంపూను వాడకూడదు. షాంపూ హెయిర్‌ కండిషనర్‌ కాదని గుర్తించాలి.
 
వెంట్రుకలకు బెస్ట్‌ కండిషనర్‌ గుడ్డు. పచ్చసొనలో పోషకాలు, ఫ్యాట్స్‌ బాగా ఉంటాయి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. గుడ్డులోని తెల్లసొన వెంట్రుకల్లో ఉన్న జిడ్డును పోగొడుతుంది. పచ్చసొన పొడి జుట్టుకు, తెల్లసొన జిడ్డు వెంట్రుకలకు బాగా ఉపయోగపడతాయి.
 
తల దురద పెడుతుంటే రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌, నూనె మిశ్రమంతో నెత్తికి మసాజ్‌ చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత నీళ్ళతో కడిగేసుకోవాలి.