29-05-2019: ఎండ, కాలుష్యం, వాతావరణంలో తేమ వంటివి కురుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే అలోవెరా, కొబ్బరినూనె మిశ్రమంతో కేశాలను కాపాడుకోవచ్చు. అంతేకాదు వెంట్రుకలను సుతిమెత్తగా, ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు అపర్ణా సంతానం.
కుదుళ్లకు పోషణ: అలోవెరాలోని విటమిన్లు, లవణాలు, ప్రొటీయోలైటిక్ ఎంజైమ్స్, ప్రొటీన్స్ వెంట్రుకల కుదుళ్లకు పోషణనిస్తాయి. కేశాలను పట్టులా, సున్నితంగా మారుస్తాయి. దాంతో చక్కగా కొప్పు లేదంటే రింగు రింగుల హెయిర్ స్టయిల్స్తో పార్టీలు, ఫంక్షన్లలో మెరిసిపోవచ్చు.
పెలుసుదనం తగ్గుతుంది: సమ్మర్లో నీటిలో ఉప్పు శాతం ఎక్కువవుతుంది. తలంటుకున్నప్పుడు జుట్టు గరుకుగా, పెలుసుగా తయారువుతుంది. అలోవెరా కలిపిన కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకుంటే కురులకు లోపల నుంచి పోషణ లభిస్తుంది. ఫలితంగా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాదు కేశాల పీహెచ్ సమంగా ఉంటుంది. అలోవెరాలోని యాంటీ ఫంగల్ గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో వెంట్రుకలు పట్టులా తళతళలాడుతాయి.
వెంట్రుకలకు మరమ్మతు: కొబ్బరి నూనె, అలోవెరా మిశ్రమం జట్టును కండీషనింగ్ చేస్తుంది. నిర్జీవంగా ఉన్న శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలోవెరాలోని ఎంజైమ్లు మాడు భాగంలోని చర్మం మీది మృత కణాలను తొలగిస్తాయి.
కురులు ఒత్తుగా: ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే, వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోయి, కురులు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది.