హెయిర్‌ డై వేస్తున్నారా?

24-05-2019: వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్న సమస్య తెల్ల వెంట్రుకలు. వీటిని దాచడం కోసం ఎవరికి తోచిన హెయిర్‌ డై వారు ఎంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని కొనే సమయంలో, వాడుక సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మేలు!
 
బాక్స్‌ మీద బొమ్మ: హెయిర్‌ డై డబ్బా మీద కనిపించే మోడల్‌ హెయిర్‌ కలర్‌ ఉన్నంత ముదురు రంగు, మనం వేసుకున్నప్పుడు కనిపించదు. కాబట్టి మోడల్‌ హెయిర్‌ కలర్‌ కాకుండా, అదే డబ్బాలో పేర్కొన్న కలర్‌ చార్ట్‌ వెతికి, ఎంచుకున్న రంగుతో సరిపోల్చుకుని గమనించాలి. అదే అంతిమంగా మీరు పొందే హెయిర్‌ కలర్‌.
 
తగినంత డై: జుట్టు పొడవును బట్టి ఎంత రంగు కలపాలనేది నిర్ణయించుకోవాలి. రెండు విడతలుగా కలపుకుంటే, రంగులో తేడా రావచ్చు. కాబట్టి ఒకేసారి సరిపడా కలుపుకోవాలి. లోహపు గిన్నెలో కలుపుకుంటే ఆక్సిడైజ్‌ అయిపోయి రంగు మారిపోవచ్చు. కాబట్టి గాజు లేదా ప్లాస్టిక్‌ గిన్నెలోనే కలుపుకోవాలి.
 
కుదుళ్లు కాదు, అంచులు: ఎక్కువ మంది కుదుళ్లకు రంగు ఎక్కువగా పట్టించేస్తూ ఉంటారు. కానీ వెంట్రుకల చివర్లు రంగు ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి అంచుల్లో ఎక్కువగా అప్లై చేయాలి. అలాగే రంగు ఎక్కువకాలం వెంట్రుకలకు నిలిచి ఉండాలంటే హెయిర్‌ డైలో ఒక టీస్పూను కార్న్‌స్టార్చ్‌ కలపాలి.