రుతుస్రావ వేళల్లో!

29-05-2018: రుతుస్రావం స్త్రీల సహజ శరీర ధర్మమే అయినా, ఆ సమయంలో జననాంగ పరిశుభ్రత విషయంలో అత్యంత శ్రద్ద వహించాల్సి ఉంటుంది. కేవలం పరిశుభ్రత వల్లే పలురకాల అనారోగ్యాలు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒకవేళ ఆ జాగ్రత్తలేవీ పాటించకపోతే, శరీరంలో సహజంగా రక్షణ కల్పించే రసాయన వాతావరణమంతా మారిపోయి, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువవుతుంది.

దయనీయ స్థితి ఏమిటంటే, భారత దేశంలో రుతుక్రమంలో ఉన్న 77 శాతం మంది స్త్రీలు లేదా బాలికలు రుతుస్రావాన్ని పీల్చడానికి నేటికీ పాతబట్టల్నే వాడుతున్నారు. పైగా వాటినే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. అయితే కొంత మంది ఇందుకు గరుకు గుడ్డల్ని వాడటం వల్ల , జననాంగంలో కంటికి కనపడని సూక్ష్మగాయాలై, వాటి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోకి చేరుతుంది. గుడ్డలతో తయారుచేసే ప్యాడ్స్‌ కొంత నిలకడగా వాడగలిగేవే అయినా, వాటిని చాలా శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలి. ఎందుకంటే ఎండ సహజసిద్దమైన స్టెరిలైజర్‌, బ్యాక్టిరియాను సమర్థవంతంగా చంపేస్తుంది.
 
 పేద కుటుంబీకులైన కొందరికి, గుడ్డ ప్యాడ్స్‌ను ఉతికాక, ఆరవేయడానికి ఎండ తగిలే సరియైున చోటు దొరకడం కూడా కష్టంగానే ఉంటుంది. పైగా సంస్కృతీపరమైన నిషేధాలు కూడా ఉండడం వల్ల, వాటిని ఎవరికీ కనపడని చోట, ఏ చూరు కిందో ఆరవేస్తారు. సరిపడా ఎండ పడక, అవి పూర్తిగా ఆరకపోయినా, వాటినే మళ్లీ వాడతారు. ఫలితంగా, జననాంగాలు తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా కొందరిలో అండవాహికలు మూసుకుపోయి సంతానం కలగకపోయే ప్రమాదమూ ఉంది. లేదా గర్భాశయానికి బదులు, అండవాహికలోనే పిండోత్పత్తి జరిగి, అది పగిలి ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరగవచ్చు.
  పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ల్ల చేరినప్పుడు రుతుస్రావ సమస్యలు, తెల్లబట్ట, నడుమునొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. జననాంగ ఇన్ఫెక్షన్ల సమస్య దీర్ఘకాలికంగా ఉన్న వారిలో కొందరు కేన్సర్‌ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే రుతుస్రావ వేళల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని.....
 బహిష్టువేళల్లో ఉండే సహజమైన బద్దకం వల్ల కొందరు స్నానం చేసే విషయంలో కాస్త నిర్లక్షంగానే ఉంటారు. కానీ, ఈ సమయంలో ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. వీలైతే రెండు సార్లు చేస్తే మరీ మంచిది. మల, మూత్ర విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ జననాంగాలను శుభ్రం చేసుకోవడం కూడా అంతే అవసరం. అయితే అలా శుభ్రపరిచే సమయంలో నీరు మలద్వారం నుంచి యోని వైపు గానీ, మూత్ర ద్వారం వైపుగానీ వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
 శానిటరీ నాప్‌కిన్స్‌ను, తడిని బాగా పీల్చగల మెత్తని గుడ్డతో చేసిన ప్యాడ్లను మాత్రమే రుతుస్రావాన్ని పీల్చేందుకు ఉపయోగించాలి. వీటిని తరుచూ అంటే అవసరమైనంత వ్యవధిలో మార్చుకోవాలి. ఒకవేళ ఎక్కువ సేపు మార్చుకోకపోతే దుర్వాసన వేయడంతో పాటు తొడలు రాపిడికి గురయ్యే అవకాశం ఉంది.
 ఒకవేళ అంతకు ముందు వాడిన ప్యాడ్స్‌నే తిరిగి వాడుతున్నట్లయితే, వాటిని సబ్బుతో బాగా శుభ్రంచేసి ఎండలో బాగా ఆరవేసిన తర్వాతే భద్రపరుచుకోవాలి. తడి ఆరని గుడ్డల్నే తిరిగి వాడితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.
 మళ్లీ ఉపయోగించడం వీలు కాని ప్యాడ్స్‌ను కూడా, నీటితో శుభ్రపరచాలి. ఆ తర్వాత పాత పేపర్లో చుట్టి మూత ఉన్న బకెట్‌లో వేసి బయటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలి. లేదా వాటిని కాల్చేయడమో, మట్టిలో పూడ్చేయడమో చేయాలి.
 ప్యాడ్‌ను తొలగించి, మరో ప్యాడ్‌ను పెట్టుకునే మందు జననాంగాలకు అంటిన రక్తాన్ని, రక్తపు గడ్డల్ని శుభ్రంచేసుకోవాలి.
రుతుక్రమం అనేది సహజ పరిణామమే అయినా, అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే అసహజ పరిణామాలెన్నో చోటు చేసుకుని, అనవసరంగా పలుబాధలు ఎదుర్కోవలసి వస్తుందనే నిజాన్ని గుర్తుంచుకుంటే చాలు ఈ దశ చాలా సాఫీగానే సాగిపోతుంది.