తల్లి డిప్రెషన్‌లోకి వెళ్తే..

ఆంధ్రజ్యోతి(11-10-2016): గర్భిణిగా ఉన్న సమయంలో డిప్రెషన్‌కు లోనయితే ఆ ప్రభావం పిల్లలపై ఉంటుందని తాజా సర్వే తేల్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. తాజా సర్వే కూడా అదే చెబుతోంది. గర్భిణీలు చిన్నచిన్న విషయాలకు బాధపడటం, డిప్రెషన్‌కు లోనయితే పుట్టబోయే బిడ్డలో మానసికమైన సమస్యలు వస్తాయని ఈ సర్వేలో తేలింది.
 
లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ చేసిన ఈ సర్వేలో ప్రతి ఐదుగురు గర్భిణుల్లో ఒకరికి పుట్టే బిడ్డకు ఇలా జరుగుతుందని పరిశోధకులు తేల్చారు. పిల్లలు ఇలా పుట్టిన తర్వాత మానసికంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే మాత్రం గర్భిణులు డిప్రెషన్‌లోకి వెళ్లకుండా చూసే బాధ్యత కుటుంబ సభ్యులదేనని పరిశోధకులు సూచించారు. వాస్తవానికి గర్భిణిగా ఉన్న సమయంలో మహిళల్లో మూడ్‌ ఎక్కువగా మారుతుంటుంది. అయితే డిప్రెషన్‌ మూడ్‌లో ఉండేవారికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరఫీ ఇవ్వాలని ఈ సర్వే చేసిన ప్రముఖ పరిశోధకుడు గ్లోవర్‌ చెబుతున్నారు. 
‘యుద్ధాలు జరిగే దేశాల్లో, కరువు కాటకాలు ఉండే ప్రాంతాలు, ప్రకృతివైపరీత్యాలు సంభవించినచోట, కావాల్సిన కనీస సదుపాయాలు లేని పేదదేశాల్లో ఉండే గర్భిణులు ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది’ అని పరిశోధకులు అంటున్నారు.