ఆంధ్రజ్యోతి, 10-05-2018: ఏం తినాలి? ఏం తినకూడదు?.. ఏ వ్యాయామాలు చేయాలి?.. ఏవి చేయకూడదు?.. ఇటువంటివే బోలెడు సందేహాలు, ప్రశ్నలు బుర్రలో గిరగిరా తిరుగుతుంటాయి గర్భిణులకు. వీటి గురించి ఎవర్ని అడగాలి? పదే పదే తలెత్తే ప్రశ్నలకు విసుక్కోకుండా సమాధానాలు ఎవరు ఇస్తారు? అందుకు ‘ఐ లవ్ 9 మంత్స్’ మీకు సాయం చేస్తుంది అంటున్నారు గంగా రాజ్, అంజలీ రాజ్‌లు.
‘‘ప్రెగ్నెంట్ అంటే పేషెంట్ కాదు. మరో జీవికి ప్రాణం పోసే మాతృమూర్తి. గర్భిణులకి సంబంధించి మేం తయారుచేసిన ‘ఐ లవ్ 9 మంత్స్’ అప్లికేషన్లో ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత అన్ని విషయాల గురించి పొందుపరిచాం. నాలుగువేల నిమిషాల నిడివి గల వ్యాయామ వీడియోలు ఉన్నాయి. ఇవి ప్రి, పోస్ట్ ప్రెగ్నెన్సీ వీడియోలు. అలాగే ప్రశ్న, జవాబులు ఉంటాయి. పది కంటే ఎక్కువగా హెల్త్ట్రాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కూడా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. పోషకాహారం, ఎలాంటి కేర్ తీసుకోవాలి వంటి విషయాలతో పాటు కీగిల్ అనే వ్యాయామం గురించి ఉంది ఇందులో. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే డాక్టర్లు ఈ వ్యాయామం చేయమంటారు కానీ ఎలా చేయాలో చెప్పరు. ఆ వ్యాయామాన్ని మా యాప్‌లో చూసి చేయొచ్చు. ఎన్నో వ్యాయామాలు ఉన్నాయి. కానీ మేము యోగాకి పెద్దపీట వేశాం. మా లక్ష్యం ఒక్కటే ఎక్కువమంది గర్భిణులకు చేయూతగా ఉండాలి. వాళ్ల సందేహాలను తీర్చి ఆరోగ్యంగా ఉంచాలి.
సదా తోడుగా...
‘బర్త్ కంపానియన్స్’ ఉంటారు. వీళ్లు ప్రీ, ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీలలో సదా మీకు తోడుగా ఉంటారు. మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడతారు. మానసికంగా ఎంతో సపోర్టు ఇస్తారు. శరీరానికి సంబంధించి చేసే వ్యాయామాల విషయంలోనూ తోడ్పడతారు. నర్సింగ్ చదివిన వాళ్లని ‘బర్త్ కంపానియన్స్’గా తీసుకుని వాళ్లకి 45 రోజులు శిక్షణ ఇస్తాం. అందులో భాగంగా ఆయుర్వేద థెరపీలు కూడా నేర్పిస్తాం. వాళ్ల దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది. అది యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ప్రసవం సమయంలో ఏం చేయాలో చెబుతారు. కండరాలకు సంబంధించిన రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తారు. పాదాలు, భుజాలు, శరీరానికి పూర్తిగా ఆయుర్వేదిక్ థెరపీ మసాజ్ ఇస్తారు. ఈ మసాజ్లను వారానికి లేదా 28 రోజుల థెరపీగా ఎంపిక చేసుకోవచ్చు. మెడికేటెడ్ ఆయిల్స్‌తో ఈ మసాజ్‌లు ఉంటాయి. ఇదేదో మేము కొత్తగా చేస్తున్నదేం కాదు. ప్రాచీన కాలంగా వస్తున్న వాటినే మేము ఆచరణలోకి తెస్తున్నాం.
మరిచిపోయే సమస్యే లేదు
మన దేశంలో డెవల్‌పమెంటల్ డిజార్డర్లను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. అలా కాకుండా మార్పు వెనువెంటనే గుర్తించే వీలుగా పిల్లల పెరుగుదల గురించి తెలుసుకునే సౌకర్యం ఉంది. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే వైద్యసాయం తీసుకోవచ్చు. తల్లీబిడ్డల ఆరోగ్యంలో భాగంగా ఇమ్యునైజేషన్, డెవల్‌పమెంటల్ మైల్‌స్టోన్స్ ఎప్పటికప్పుడు గమనించేలా యాప్ తయారుచేశాం. రిమైండర్ సౌకర్యం ఉంది. ఇమ్యునైజేషన్, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన తేదీల గురించి రిమైండర్ పెట్టుకోవచ్చు. అవెలా మర్చిపోతారు అనిస్తుంది. కానీ ఒక సర్వే ప్రకారం మన దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పిల్లలకు ఇమ్యునైజేషన్ చేయించడం మర్చిపోవడం 70శాతంగా ఉంది. అందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. ‘ఐలవ్ 9మంత్స్’ యాప్‌లో రిమైండర్ పెట్టుకుంటే అదే గుర్తుచేస్తుంది. అప్పుడు మరపు అనేదే ఉండదు.
మా ‘బర్త్ కంపానియన్స్’ గర్భిణుల ఇంటికి వెళ్లి యాప్ సరిగా వాడుతున్నారా లేదా అనేది గమనిస్తారు. తల్లీపిల్లలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం వల్ల ఎంత మంది పిల్లలు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఎంతమంది వేయించుకోలేదనే డేటా రికార్డు అవుతుంది. ఇది తల్లీపిల్లల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు రూపొందించే పథకాలకు బాగా ఉపయోగపడుతుంది.
ఇక ఎదురుచూడాల్సిన పనిలేదు!
డాక్టర్ల కోసం కూడా ఒక అప్లికేషన్ తయారుచేశాం. దీనిద్వారా గర్భిణులతో డాక్టర్ కనెక్ట్ అవ్వడం సులభం అవుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే గర్భిణులు ప్రతీసారి డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. డాక్టర్లు ఎక్కువమందిని చూసే అవకాశం ఉంటుంది. డిజిటల్‌గా గర్భిణులకు సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలైతే ఉంటాయో అలాంటివే యాప్‌లో ఉన్నాయి. డాక్టర్లు సమాచారాన్ని అప్లోడ్ చేసి గర్భిణితో షేర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్లు కూడా డాక్టర్‌తో సమాచారాన్ని అప్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కాకపోతే ప్రతీసారి డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. గర్భిణీలకు చిరాకు కలిగే విషయం ఎక్కువసార్లు డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సి రావడమే. అలాకాకుండా మీకు సమయాన్ని, విశ్రాంతిని అందిస్తుంది ఈ యాప్. టెలీమెడిసిన్ లాంటిదన్నమాట. యాప్‌లో టైం ఫిక్స్ చేసుకుని డాక్టర్‌తో వీడియో ద్వారా మాట్లాడొచ్చు. దీనివల్ల డాక్టర్ని కలిసేందుకు గంటలు గంటలు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.
గ్రామాల్లోనే ఎక్కువ
‘ఐ లవ్ 9 మంత్స్’ ఏర్పాటుకు ముందు దాదాపు ఏడాదిన్నర పరిశోధన చేశాం. నవంబర్ 2017 నుంచి దీన్ని వాడుకలోకి తీసుకొచ్చాం. యాప్ మార్కెట్లోకి వచ్చినప్పటినుంచీ ఇప్పటివరకు దాదాపు ఐదువేలకి పైగా డౌన్లోడ్లు అయ్యాయి. మా బృందంలో డాక్టర్లు, చీఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్, స్ర్టాటజీ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అప్లికేషన్‌ను గ్రామాల్లో ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్నారు. పెద్ద నగరాల్లో ఈ సౌకర్యాలు కలిగిన స్టూడియోలు, ఆసుపత్రులు ఉన్నాయి. ప్రెగ్నెన్సీ, చైల్డ్‌బర్త్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. కానీ గ్రామాల్లో ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవు కాబట్టి అక్కడే అప్లికేషన్ ఎక్కువగా డౌన్లోడ్ అయ్యింది. గర్భిణులకు సంబంధించిన ఆయుర్వేదిక ఉత్పత్తులను పరిచయం చేయబోతున్నాం. మేము మా ప్రయాణంలో ముందుకు వెళ్లగలుగుతున్నాం అంటే ‘టీ హబ్’ వల్లనే. అది మాకు ఎంతో మైలేజి ఇచ్చింది.’’
మేనేజ్మెంట్తో మార్కెట్‌ను జతచేసి
‘‘అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే ఈ ఆలోచనను ప్రెజెంట్ చేసి జాతీయ స్థాయిలో ఎంట్రప్రెన్యూర్ పోటీలో పాల్గొని అవార్డు అందుకున్నా. ‘పాన్ ఏషియా’ కాంపిటీషన్‌కు వెళ్లి ఫైనలిస్ట్‌గా నిలిచాను. ఆ తరువాత ఎంట్రప్రెన్యూర్షిప్లో మాస్టర్ డిగ్రీ యుకెలో చేశా. తిరిగొచ్చాక మార్కెట్లో ఉన్న అవసరానికి నా మేనేజ్మెంట్ చదువును జత చేరిస్తే బాగుంటుంది అనిపించింది. అదే విషయాన్ని గంగా రాజ్‌తో చెప్పాను. తన దగ్గరకు వచ్చే క్లయింట్లు ఎన్నో సందేహాలు అడుగుతుండేవారు. వాటన్నింటికీ సమాధానంగా ‘ఐ లవ్ 9మంత్స్’ ఏర్పాటుచేశాం. నేను బెంగళూరులోని ఫోర్టి్సలో ‘చైల్డ్‌బర్త్ ఎడ్యుకేటర్’గా పనిచేశా. ‘లాక్టేషన్ కన్సల్టెంట్’ను కూడా. పుట్టింది కేరళలో కానీ హైదరాబాద్, వైజాగ్లలోనే పెరిగాను.’’
- అంజలీ రాజ్, సహవ్యవస్థాపకురాలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
ఎక్కువమందిని చేరేందుకు..
‘‘ఫిట్నెస్ రంగంలో ఉండబట్టి పదిహేనేళ్లకు పైనే అయ్యింది. అంజలి యుకెలో మాస్టర్స్ చదివి వచ్చాక తనకున్న ఆలోచనను నాతో పంచుకుంది. అప్పటికే నేను ప్రీ, పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్‌ను. ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు ఎక్కువమందికి చేరాలంటే డిజిటల్‌గా చేయడమే బెటర్ అనిపించింది. అదే స్టూడియో ఏర్పాటుచేస్తే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకే చేరుతుంది. డిజిటల్‌గా అయితే మారుమూల ప్రాంతాలకు చేరొచ్చు అనే ఆలోచనతో ‘ఐ లవ్9 మంత్స్’ను డిజిటల్‌గా తయారుచేశాం. ఈ స్టార్ట్‌పలో ఉన్న ముగ్గురు మహిళలం కూడా ఇంచుమించుగా దీనికి సంబంధించి పనిచేస్తున్న వాళ్లమే కాబట్టి మా ఆలోచనకు రూపం ఇవ్వడం సులభమైంది. నేనూ పుట్టింది కేరళలో. కానీ మా నాన్న ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగాను.’’
- గంగా రాజ్, సహవ్యవస్థాపకురాలు, డైరెక్టర్ వెల్నెస్
కిరణ్మయి
ఫొటోలు: ఎల్. అనిల్‌కుమార్ రెడ్డి