గర్భస్థ శిశువుకు భరోసా

ఆంధ్రజ్యోతి(17-10-2016): కొంతమంది పిల్లలు పుట్టీపుట్టగానే పుట్టెడు జబ్బులతో సతమతమవుతూ ఉంటారు. నీజానికి వీటిల్లో చాలా జబ్బులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలై ఉంటాయి. వీటిని ముందే గుర్తించే వైద్య వ్యవస్థ ఒకప్పుడు లేదు. ఫీటల్‌ మెడిసిన్‌ అనే వైద్య శాఖ ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ నిర్వహిస్తోంది. గర్భస్థ శిశువు సమస్యల్ని పుట్టేనాటికే గుర్తించి అవి తీవ్రమైపోకుండా చూడగలిగితే పుట్టాక వాటిని సరిచేసేందుకు వెసులుబాటు ఉంటుంది. తల్లిదండ్రులకున్న పలురకాల జబ్బుల ప్రభావం కూడా పిల్లల మీద పడకుండా నిలువరించే అవకాశం కూడా సమృద్ధిగా ఉంటుందంటున్నారు సీనియర్‌ గైనకాలజిస్టు, ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మీ కిరణ్‌. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
 
పుట్టిన బిడ్డ నిండు చందమామలా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు! కానీ, చాలామందికి ఉండే ఆ అందమైన కల పుట్టిన బిడ్డను చూడగానే చెల్లాచెదురైపోతోంది. కానీ, ఆ కలను నిజం చేసేందుకే ఈ ఫీటల్‌ మెడిసిన్‌ అవతరించింది. చాలాసార్లు ఇంత చిన్న వయసులో ఇన్ని రకాల జబ్బులేమిటా? అని మనసు చివుక్కుమంటుంది కూడా. అసలీ జబుల్లో చాలావరకు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మొదలైనవే. ఆశ్చర్యమేమిటంటే బయటున్న పెద్దవాళ్లకు ఎన్ని రకాల జబ్బులు ఉంటాయో గర్భస్థ శిశువుకు అంతకన్నా ఎక్కువ రకాల జబ్బులు ఉండవచ్చు. పుట్టిన తర్వాత అందరిలో అతి మామూలుగా తిరుగాడుతున్నా, గర్భంలో ఉన్నప్పుడు అంటే శరీర నిర్మాణ సమయంలోనే ఎన్నో అవయవాల్లో లోపాలు ఏర్పడి ఉండవచ్చు. లోపల పెరుగుదలే సరిగా లేకపోవచ్చు. ఒకవేళ పెరుగుదలలో పెద్ద అడ్డంకులేమీ లేకపోయినా తల్లికి ఏదైనా సమస్య ఉండి, అది పిండాన్ని ప్రభావితం చేయవచ్చు. తల్లిలో ఇన్‌ఫెక్షన్లు ఉంటే అవి కూడా శిశువును ప్రభావితం చేయవచ్చు. మొత్తంగా చూస్తే కన్నవారికి ఎన్ని రకాల జబ్బులున్నాయో, అవన్నీ శిశువుకు రావచ్చు. కొందరిలో అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. అంటే జన్యుపరమైన సమస్యలు, క్రోమోజోమ్‌ సమస్యలు ఉండవచ్చు. నిజానికి అంతేసి సమస్యలు ఉన్న పిండాలు లోపల మనగలగడమే దాదాపు అసంభవమైపోతుంది. అలాంటి పెద్ద సమస్యలున్న శిశువులు పుట్టడమే జరగదు. ఒకవేళ పుట్టినా అసంపూర్ణంగా, పలురకాల లోపాలతో గానీ, వివిధ రకాల వ్యాధులతో గానీ పుట్టవవచ్చు. అందులో కొందరిది అర్థాంతరపు జీవితమే కావచ్చు. లేదా నిర్జీవంగా కూడా పుట్టవచ్చు.
క్రోమొజోముల తేడాలు..
గర్భస్థ శిశువు ఎదుర్కొనే వాటిలో క్రోమోజో ములసమస్య ఒకటి. ఈ సమస్యకు సంబంధించి ఒకప్పుడు ఇంత అవగాహన ఉండేది కాదు. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువగానే ఉంటోంది. అందుకే ప్రతి గర్భానికీ తొలి మూడు మాసాల కాల వ్యవధిలో క్రోమోజోమ్‌ పరీక్ష చేయించమని సూచించడం జరుగుతోంది. బయటున్న వ్యక్తులకైతే రక్తపరీక్షల ద్వారా ఆ సమస్యను గుర్తించవచ్చు. గర్భస్థ శిశువులకు కొన్ని మార్కర్ల ద్వారా క్రోమోజోముల సమస్య ఉండే ప్రమాదం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆ ప్రమాదం ఎక్కువగా అనిపిస్తే, లోపలున్న పిండాన్ని తాకకుండా దానిచుట్టూ ఉండే ఉమ్మనీరు ఆధారంగా పరీక్ష చేస్తాం. ఈ క్రోమొజోమ్‌ సమస్య ఏ దశలోనైనా ఉండవచ్చు. పిండం తయారయ్యే దశలోనైనా ఉండవచ్చు. ప్రతి గర్భధారణ లోనూ శిశువుకు సంబంధించి సవిస్తరంగానే పరిశీలిస్తాం. ప్రతి 100 మంది గర్భస్థ శిశువుల్లో దాదాపు ఇద్దరు ముగ్గురిలో ఈ తయారీ లోపాలు ఉంటున్నాయి. మెదడు, కన్ను, చెవి, ముక్కు, గొంతు, పేగులు, పొట్ట, శ్వాసకోశాలు, గుండె, కాళ్లూచేతులు, వెన్నెముక, కిడ్నీలు ఇలా ఏ అవయవంలోనైనా లోపాలు ఉండవచ్చు. ఈ లోపాలు ఉండటం అన్నది రెండు మూడు శాతం పిల్లలోనే ఉంటున్నా, ఏ ఒక్క శిశువు తప్పిపోకుండా మొత్తంగా 100 శాతం పిల్లలకు ఈ స్కానింగ్‌ పరీక్షలు చేసే విధానాన్ని ఫీటల్‌ మెడిసిన్‌ ఎంచుకుంది.
 
ఎదుగుదల లోపాలు 
గర్భస్థ శిశువుల్లో ఎదుగుదల లోపాలు కూడా అంతే తీవ్రమైనవి. ఈ లోపాలకు తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఒక కారణం కావచ్చు. లేదా తల్లికి అధిక రక్తపోటు, హైపో, లేదా హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలు ఉన్నా, గర్భస్థ శిశువు ఎదుగుదల సరిగా ఉండదు. తల్లికి మధుమేహం ఉంటే శిశువు అతిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రసవ సమయంలో చోటుచేసుకునే సమస్యలు కూడా శిశువు మీద దుష్ప్రభావం కలిగించవచ్చు. నొప్పుల్ని భరించలేనితనం వల్ల గుండెవేగం పడిపోవచ్చు. విసర్జన కావచ్చు. జనన ద్వారంలో అడ్డుపడిపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఇంకా అనేకం ఉంటాయి. తల్లికున్న వ్యాధులు శిశువుకు సంక్రమించకుండా నిరోధించడం, వచ్చిన జబ్బుకు వైద్యం చేయడం అనే ఈ రెండు విధానాలు, ఫీటల్‌ మెడిసిన్‌లో ఉంటాయి. అన్నింటికన్నా ముందు తల్లికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా శ్రద్ధ వహించాలి. తల్లికి ఇన్‌ఫెక్షన్లు వస్తే అవి శిశువుకు సోకే అవకాశాలు ఏమేరకు ఉంటాయనే అంశమై ఒక అంచనాకు వచ్చి వాటిని అరికట్టే దిశగా పనిచేయాలి. చాలా సార్లు సమస్య బాగా తీవ్రమయ్యాకే వస్తుంటారు. ఆ స్థితిలో కూడా శిశువును ఆ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఎలా కాపాడవచ్చో, ఒకవేళ అప్పటికే ఇన్‌ఫెక్షన్లు దాడి చేసి ఉంటే ఆ స్థితిలో కూడా ఎలా రక్షించవచ్చో అందుకు ఉపయోగపడే వివిధ మార్గాలేమిటో నిశితంగా పరిశీలించాలి.
అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే..
మామూలుగా అయితే, తల్లిదండ్రులకు ఉండే మధుమేహం, రక్తపోటు సమస్యలు లోపల ఉండే శిశువు మీద ప్రభావం చూపవు. కాకపోతే అవి నియంత్రణలో లేనప్పుడు ఆ ప్రభావాలు శిశువుపై పడతాయి. ప్రత్యేకించి తల్లికి మధుమేహం నియంత్రణలో లేక షుగర్‌ నిల్వలు హఠాత్తుగా హెచ్చుతగ్గులకు లోను కావడం వల్ల ఒక్కోసారి శిశువు ప్రాణం కోల్పోవచ్చు. హెచ్చుతగ్గుల వల్ల శిశువు బరువు అతిగా పెరిగిపోయి ప్రసవం కష్టం కావచ్చు. గర్భంలో ద్రవాలు ఎక్కువగా చేరిపోయి అకాల ప్రసవం కావచ్చు. కడుపులో ఉండే మాయ సహజంగా తల్లి రక్తాన్ని వడబోసి పాపకు అందిస్తుంది. తల్లికి అధిక రక్తపోటు ఉంటే ఆ మాయ కుంటుపడిపోయి తల్లి రక్తాన్ని బిడ్డకు అందించలేకపోతుంది. దీనివల్ల గర్భస్థ శిశువు ఎదుగుదల బాగా ఉండదు. అందుకే హాస్పిటల్‌లో చేరిన గర్భిణికి తరచూ రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేస్తాం. వాటిని పూర్తి నియంత్రణలోకి తెస్తాం. ఏ సమస్య వచ్చే అవకాశం ఏ మేరకు ఉందో ఒక అంచనా వేస్తాం. వాస్తవానికి 90 శాతం గర్భిణుల పరిస్థితి బాగానే ఉంటుంది. మిగతా 10 శాతం మంది విషయంలో ఈ జాగ్రత్తలన్నీ అవసరవుతాయి.
 
జన్యు సమస్యలు..
జన్యుపరమైన సమస్యలు తల్లినుంచీ, తండ్రినుంచీ సమానంగానే శిశువుకు వస్తాయి. అయితే తల్లిదండ్రులకు ఏ సమస్యలూ లేకపోయినా పిల్లలకు ఈ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మేనరిక దంపతులకు కలిగిన పిల్లల్లో ఈ సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మన శరీర మూలవ్యవస్థ ఏమిటంటే, మనలో 23 జతలు అంటే క్రోమోజోములనే 46 పుస్తకాలు ఉంటాయి. ప్రతి పుస్తకంలోనూ లక్ష పేజీలు ఉన్నాయనుకుందాం. ఈ పేజీలన్నీ లక్షలాది అక్షరాలతో రాయబడి ఉన్న జీన్‌ ఫార్ములాలు. వాటిలో వాక్యదోషాలు ఉంటే అది జన్యులోపం. ఈ 46 పుస్తకాల్లో ఒకటి ఎక్కువా, తక్కువా ఉండడం క్రోమోజోము లోపం. ఏ గర్భిణిలోనైనా క్రోమోజోము లోపం రావచ్చు. ఈ లోపాల్ని ముందే స్కాన్‌ చేయడం ద్వారా వాటి పరిస్థితి తెలుసుకుంటాం. అనుమానం ఉంటే మరికొన్ని ఇతర పరీక్షలు చేస్తాం. జన్యువులనే ఈ అక్షరాల లోపాలు అందరిలోనూ ఉంటాయి. 23 జతల క్రోముజోముల్లో ప్రతి జతలో ఒకటి తండ్రినుంచి వచ్చింది, ఒకటి తల్లి నుంచి వచ్చిందీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా సరిగా ఉంటే జీవితం బాగానే సాగిపోతుంది. ఇద్దరి నుంచీ అదే పేజీలోకి అదే లోపం వచ్చిందనుకోండి. అప్పుడు ఆ శిశువులో చాలా లోపాలు ఉండవచ్చు. సాధారణంగా మేనరిక దంపతులకు కలిగిన పిల్లల్లోనే ఇలాంటి సమస్యలు ఉంటాయి. మేనరికం కాని, వేరే రకం బంధాల్లో అదే పేజీలో అదే రకమైన లోపం రావడం చాలా అరుదు. దంపతుల్లో ఎవరో ఒక్కరిలో లోపం ఉన్నా ఈ సమస్య రావచ్చు. కొన్నిసార్లు ఇద్దరిలో ఏ ఒక్కరిలోనూ ఈ లోపం లేకపోయినా రావచ్చు. కాకపోతే ఇది చాలా అరుదు. తల్లికో, తండ్రికో హెచ్‌.ఐ.వి. ఉంటే అది శిశువుకు సోకకుండా నిరోధించే శక్తిమంతమైన యాంటీ వైరల్‌ వైద్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే గర్భధారణ జరిగిన వెంటనే రక్తపరీక్షలు చేస్తాం. వీటిలో హెచ్‌.ఐ.వి. పరీక్ష కూడా ఒకటి. ఎందుకంటే ముందే గుర్తించి ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే మందులు తల్లికి ఇస్తే అది పాపకు వెళ్లే అవకాశాన్ని బాగా తగ్గించవచ్చు. ఒకప్పుడు ప్రతి నలుగురు హెచ్‌.ఐ.వి. తల్లులకు కలిగిన పిల్లల్లో ఒకరు హెచ్‌.ఐ.వి.తో ఉండేవారు. ఇప్పుడు 100 మంది హెచ్‌ఐవి తల్లులకు కలిగిన పిల్లల్లో కేవలం ఒక్కరే హెచ్‌.ఐ.వితో ప్రభావితం అవుతున్నారు. ఇది ఫీటల్‌ మెడిసిన్‌ సాధించిన గొప్ప పురోగతి.
ఫీటోస్కోపిక్‌ లేజర్‌ అనే విధానం ఇప్పుడు కొత్తగా ఫీటల్‌ మెడిసిన్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది. కవల పిల్లల్లో వచ్చే పలురకాల సమస్యల్ని దీనిద్వారా తగ్గించే అవకాశాలు భవిష్యత్తులో మెండుగా ఉంటాయి. ఏమైనా గర్భస్థ శిశువులో ఉండే శిశుశరీర నిర్మాణ సమస్యల్ని తీవ్రం కాకుండా ముందే నియంత్రించగలిగితే పుట్టిన తర్వాత ఆ లోపాల్ని సరిచేయవచ్చు. గర్భస్థ శిశువులోని పలు సమస్యల్ని పుట్టేదాకా అలా నియంత్రించడమే ఫీటల్‌ మెడిసిన్‌లోని ఒక అద్భుతమైన ముందడుగు. పుట్టే పిల్లలు పువ్వుల్లా, నిండు నవ్వుల్ని పూయింగలిగేలా వారిని నిలబెట్టడంలో ఈ విధానం వైద్య రంగంలో తిరుగులేనిదే మరి!! 
 
కన్నవారికి ఎన్ని రకాల జబ్బులున్నాయో, అవన్నీ శిశువుకు కూడా రావచ్చు. కొందరిలో అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. అంటే జన్యుపరమైన సమస్యలు, క్రోమోజోమ్‌ సమస్యలు ఉండవచ్చు. నిజానికి అంతేసి సమస్యలు ఉన్న పిండాలు లోపల మనగలగడమే దాదాపు అసంభవమైపోతుంది. అలాంటి పెద్ద సమస్యలున్న శిశువులు పుట్టడమే జరగదు. ఒకవేళ పుట్టినా అసంపూర్ణంగా, పలురకాల లోపాలతో గానీ, వివిధ రకాల వ్యాధులతో గానీ పుట్టవవచ్చు. అందులో కొందరిది అర్థాంతరపు జీవితమే కావచ్చు. లేదా నిర్జీవంగా కూడా పుట్టవచ్చు. 
 
డాక్టర్‌ లక్ష్మీ కిరణ్‌ 
సీనియర్‌ గైనకాలిజిస్ట్‌ 
అండ్‌ ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ 
బర్త్‌ రైట్‌(రెయిన్‌బో)హైదరాబాద్‌