అమ్మో... ఇదేం నీరసం..!

16-09-2019: విపరీతంగా శ్రమించినప్పుడు శరీరమో, మనసో అలసిపోతే సరే అనుకోవచ్చు. కానీ పెద్దగా ఏమీ శ్రమించకపోయినా, ఒళ్లంతా హూనమైనట్లు, అకారణంగా,మనసంతా కుంగిపోయినట్లు ఉంటే ఏమనుకోవాలి! ఈ నీరసం ఏదో వారం, పదిరోజులు అని కూడా కాదు. అటూఇటుగా ఆరు మాసాల దాకా కొనసాగుతూనే ఉంటుంది. దానికే ‘క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌’ (సి.ఎఫ్‌.ఎస్‌) అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. అసలింతకీ ఈ సి.ఎఫ్‌.ఎస్‌ మూలాలేమిటి? వీటి నుంచి విముక్తి పొందే మార్గమేమిటి?
 
అప్పటిదాకా అలవోకగా పదీ, పన్నెండుగంటల పాటు శ్రమించే వ్యక్తి, ఆరేడు గంటలకే అలసిసొలసి వాలిపోతుంటే ఏమనుకోవాలి? చూసేవాళ్లేమో ‘కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందిలే’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తారు. కానీ, కొందరిలో ఆ అలసట రోజుల పర్యంతం విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. దీనికి తోడు మెడ నుంచి పాకే సర్వికోజెనిక్‌ తలనొప్పి మొదలవుతుంది.
 
ఫెటీగ్‌తో పాటు, పోస్ట్‌ ఎగ్జర్షనల్‌ మలైస్‌, గాఢనిద్ర లేకపోవడం, ఆర్థోస్టాటిక్‌ సింప్టమ్‌ వంటి మరికొన్ని లక్షణాలు తోడవుతాయి. దీనితో రోజురోజంతా మగతగా ఉండడం... దేనిపైనా మనసు లగ్నం చేయలేకపోవడం ఉంటాయి. ఈ స్థితి జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తుంది. సామాజికమైన ఒక ఒంటరితనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే, ఈ అలసటకు హార్మోన్‌ సంబంధమైన సమస్యలేవీ కారణం కాదని తేలినప్పడు మాత్రమే దాన్ని సి.ఎ్‌ఫ.ఎ్‌సగా భావించే అవకాశం ఉంది.
 
ఎంతో తేడా
ఉదయం మేలుకున్నప్పటి నుంచీ ఒకటే నీరసం. కొద్దిపాటి శారీరక కార్యకలాపాలకే ఆ నీరసం మరింత తీవ్రమవుతుంది. ఏవో సాధారణ మందుల వల్లగానీ, విశ్రాంతి వల్ల గానీ, బలమైన పోషకాహారం వల్ల గానీ ఈ నీరసం తగ్గదు. సి.ఎ్‌ఫ.ఎ్‌సను కొందరు డిప్రెషన్‌ ఫలితంగా చెబుతారు. మరికొందరేమో నీరసం డిప్రెషన్‌ను కలిగిస్తే, డిప్రెషన్‌ నీరసాన్ని కలిగిస్తుందని... వాటి పరస్పర సంబంధాన్ని చెబుతారు. అయితే, దీర్ఘకాలంగా కొనసాగే అలసట ఒక్కోసారి, లోపల గూడుకట్టుకుని ఉన్న ఏదో ఒక ఆరోగ్య సమస్యకు చిహ్నం కావచ్చు. ఈ అలసటకూ, శక్తిహీనతకూ ఏదైనా కారణం ఉన్నట్లు బయటపడితే, దానికి చికిత్స చేసిన వెంటనే, వాళ్లు ఆ సమస్య నుంచి కోలుకుంటారు. వాళ్లు కోలుకున్నారూ అంటే అది సి.ఎ్‌ఫ.ఎస్‌ కాదనే నిర్ధారణకు రావచ్చు. అలా కోలుకోకుండా, ఆ నీరసం ఇంకా కొనసాగుతూనే ఉందీ అంటే అది సి.ఎఫ్..ఎస్‌ అనే నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
 
హార్మోన్ల సమస్య...
అడిసన్‌ అనే వ్యాధి వల్ల కొందరిలో అడ్రినల్‌ గ్రంథి, కార్టిసాల్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతుంది. దీనివల్ల నీరసం రావడంతో పాటు ఆకలి తగ్గిపోతుంది. నిజానికి కార్టిసాల్‌ హార్మోన్‌ శరీర వ్యవస్థలో అత్యంత కీలకమైనది. ఈ లోపాన్ని వెంటనే పూరించకపోతే, ఇది ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. కార్టిసాల్‌ హార్మోన్‌ సహజంగా శక్తిని ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించడం సులువవుతుంది. అడిసన్స్‌ వ్యాధిలో ఆటో ఇమ్యూనిటీ వల్ల గానీ, క్షయ వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల గానీ, అడ్రినల్‌ గ్రంథులు దెబ్బతింటాయి. ఫలితంగా, చిన్న చిన్న పనులకే విపరీతంగా అలసిపోతారు. కాకపోతే, కార్టిసాల్‌ మందులు వాడిన వెంటనే, ఫలితం కనిపిస్తుంది వెనువెంటనే ఆకలి పెరుగుతుంది. క్రానిక్‌ ఫెటీగ్‌ సమస్య తొలగిపోతుంది.
సి.ఎఫ్.ఎస్‌ సమస్య పురుషుల్లో సాధారణంగా వయసు పైబడిన దశలోనే కనిపిస్తుంది. వృద్ధాప్యంలో దాదాపు అందరిలోనూ టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే, దాదాపు 40 ఏళ్లు దాటిన నాటి నుంచే ఈ పురుష హార్మోన్‌ తగ్గిపోవడంతో నిస్సత్తువతో పాటు ఒంటి నొప్పుల బారిన పడుతుంటారు.
శరీరంలో సహజసిద్ధంగా ఉండే డి.హెచ్‌.ఇ.ఏ. (డీహైడ్రోపియాండ్రోస్టెరాన్‌) ఉత్పత్తి తగ్గినప్పుడు కూడా నీరసం వస్తుంది. డి.హెచ్‌.ఇ.ఏ తగ్గినట్లు నిర్ధారణ అయితే ఆ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఫెటీగ్‌ను కలిగించే మరో ముఖ్య కారణం, గ్రోత్‌ హార్మోన్‌ లోపం. ఒకప్పుడు ఈ సమస్య చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుందని అనుకునేవాళ్లు. కానీ, శరీరంలో ఎక్కడైనా పెరిగిన కణితి వల్ల గానీ, మరేదైనా ఇతర కారణాల వల్ల గానీ, పెద్ద వాళ్లల్లో కూడా గ్రోత్‌ హార్మోన్‌ లోపం ఏర్పడుతుంది. ఆ లోపాన్ని చక్కదిద్దడమే దాని పరిష్కారం.
 
వ్యాధి నిర్ధారణ
సి.ఎఫ్..ఎస్‌ వ్యాధి నిర్ధారణకు ఒక విధానం అంటూ ఏమీ లేదు. చికిత్స కూడా అన్నింటికీ ఒక్కటే అన్నట్లు ఏదీ లేదు. అందుకే, హర్మోన్‌ లోపాల్ని ఎప్పటికప్పుడు పూరిస్తూ కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తూ, కౌన్సెలర్‌ ద్వారా కాగ్నిటివ్‌ ట్రైనింగ్‌ ఇప్పించాలి. డిప్రెషన్‌లో ఉన్నట్లు అనిపిస్తే, కాస్త తక్కువ మోతాదులో యాంటీ-డిప్రెసెంట్‌ మాత్రలు ఇస్తే సరిపోతుంది.
 
ఆహారం...
సి.ఎఫ్..ఎస్‌ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్లు తగ్గించి, ప్రొటీన్లు, ఆకు కూరలు, గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. తగ్గిన శరీరం బరువును పూరించేలా, కండరాలు, ఎముకలు బలపడే వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వాలి. అయితే తాత్కాలిక వైద్యచికిత్సలేవో తీసుకున్నా, అంతిమంగా జీవన శైలి మార్పులే క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌కు సరియైున వైద్యం అవుతుంది.
 
లక్షణాలేమిటి?
సి.ఎఫ్..ఎస్‌ లక్షణాలు... ఇవీ అని చెప్పగలిగేటంత ప్రత్యేకంగా ఏమీ ఉండవు. చాలా రకాల అనారోగ్యాల్లో ఉన్నట్లే ఇవీ ఉంటాయి. అందుకే, ఇన్‌ఫెక్షన్లు, థైరాయిడ్‌ సమస్యలు, గుండెజబ్బులు, జీవక్రియ సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు.
కొందరిలో ఫెటీగ్‌తో పాటు మతిమరుపు, ఏకాగ్రతా లోపాలు, గొంతు నొప్పి, మెడ, చంక బాగాల్లో లింఫ్‌నోడ్స్‌ పెద్దవి అవడం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, తలనొప్పి, శారీరక, మానసిక శ్రమ తర్వాత 24 గంటల పైగా తీవ్రమైన అలసట ఉంటాయి. ఈ జబ్బులో ఉండే ప్రధాన సమస్యల్లో నలుగురికీ దూరంగా ఉండడం, జీవనశైలిని కుదించుకోవడం, డిప్రెషన్‌ ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకే ఇతర సమస్యలూ లేవని తెలుసుకోవడం ద్వారానే, దాన్ని సి.ఎ్‌ఫ.ఎస్‌గా గుర్తిస్తారు. అయితే ఎక్కువ మంది సీ.ఎ్‌ఫ.ఎస్‌ బాధితుల్లో స్ట్రెస్‌, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వంటి మానసిక రుగ్మతలు సంయుక్తంగా కనిపిస్తాయి. అలాగని కే వలం డిప్రెషన్‌ వైద్యం చేస్తే, సి.ఎఫ్‌.ఎస్‌ సమస్య నిర్మూలన కాదు.
 
విరుగుడు ఇలా...
పరిష్కారానికి మూడు రకాల చర్యలు తీసుకోవాలి. మామూలుగా అయితే, ఇతర జబ్బులేవీ లేవని తేలగానే, అతనికి మంచి పోషకాహారం ఇవ్వాలి. నీరసం, ఒంటినొప్పులు వేధిస్తున్నా రోజూ వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి. ఒకవేళ మానసిక సమస్యలు ఉన్పట్లు అనిపిస్తే, సైకియాట్రి్‌స్టను సంప్రదించాలి. ప్రత్యేకించి, నెగెటివ్‌ ఆలోచనల నుంచి బయటకు రప్పించి, మనసును ఒక నిలకడకు తెచ్చే సీ.బీ.టీ (కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ) ఇప్పించాలి. అదే సమయంలో థెరపీలు, యోగా, మెడిటేషన్లు కూడా వీరికి ఉపయోగపడతాయి. మొత్తంగా చూస్తే, ఏదో ఒక విధానంతో కాకుండా పలురకాల చికిత్సల్ని సంయుక్తంగా అందించడం ద్వారానే ఈ సమస్యను సమూలంగా తొలగించవచ్చు.
 
ఆ నీరసం వెనక...
సి.ఎఫ్..ఎస్‌ సమస్యకు వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లతో పాటు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అపసవ్యతలే కాదు డిప్రెషన్‌ వంటి మానసిక రుగ్మతలు కూడా కారణమవుతాయి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, న్యుమోనియా వంటి వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో సీ.ఎఫ్‌.ఎస్‌ కనిపిస్తుంది.
 
క్రానిక్‌ ఫెటీగ్‌ బాధితుల పైన చాలా ఆరోపణలు ఉంటాయి. నలుగురితో కలవరనీ, సోమరిపోతులనీ వారిపైన కొంత మంది ముద్ర వేస్తుంటారు. ఎందుకంటే, సభలకూ, సదస్సులకూ, పార్టీలకూ, ఫంక్షన్లకూ రావడంలో వీళ్లు ఎప్పుడూ వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఆ ధోరణి వెనకున్న కారణాన్ని చాలామంది గుర్తించలేరు. 
 
 హైపో థైరాయిడిజం కూడా క్రానిక్‌ ఫెటీగ్‌ కలిగించే ఒక కారణమే! హైపో థైరాయిడిజం వల్ల జీవక్రియలన్నీ కుంటుపడతాయి. మెనోపాజ్‌ మొదలైన మహిళల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫెటీగ్‌ కారణంగా డాక్టర్‌ను సంప్రతించే ఎక్కువ మందిలో హైపో థైరాయిడిజమే కారణం.
 
రక్తంలో షుగర్‌ నిల్వలు బాగా పెరిగిపోయిన వారిలో మూత్రంలోంచి గ్లూకోజ్‌ బయటికి వెళ్లిపోవడం సాధారణమే. అయితే, గైకోసూరియా అనే ఈ సమస్యలో మూత్రం ద్వారా గ్లూకోజ్‌ వెళ్లిపోవడంతో పాటు శరీరంలోని నీరు కూడా పెద్ద మొత్తంలో బయటికి వెళుతూ ఉంటుంది. దీనివల్ల శరీరం బరువు తగ్గిపోవడం, నీరసంతో పాటు, విపరీతమైన అలసటా ఉంటాయి. కాకపోతే, మధుమేహం పూర్తి నియంత్రణలోకి రాగానే నీరసం కూడా పోతుంది. నియంత్రణే లేకుండా మధుమేహం ఎక్కువ కాలంగా కొనసాగుతున్నప్పుడు, అంతిమంగా గ్లూకోజ్‌గా మారాల్సిన ఫ్యాట్‌, ప్రొటీన్‌ ధ్వంసమైపోతాయి. ఈ స్థితిలో కండరాలు బాగా బలహీనపడి, అలసట, క్రానిక్‌ ఫెటీగ్‌ మొదలవుతాయి. కొందరిలో విటమిన్‌ బి-12, విటమిన్‌-డి లోపాలు కూడా ఫెటీగ్‌కి కారణమవుతున్నాయి. హార్మోన్‌ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం కూడా ఈ సమస్యకు మూలమవుతుంది.
 
సి.ఎఫ్..ఎస్‌ రావడానికి ఏదో ఒక్క కారణం అంటూ ఏమీ ఉండదు. శారీరక, మానసిక కారణాలు కలగలిసి ఉంటాయి. దానికి చేసే వైద్యం కూడా ఆ వ్యక్తి పరిస్థితిని అనుసరించి పలురకాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య యువత నుంచి మధ్యవయసు వారిలోనే కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సమస్య రెండింతలు. వైరస్‌, ఇమ్యూన్‌ డిస్‌ఫంక్షన్‌, ఎండోక్రైన్‌ మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌, న్యూరోసైకియాట్రిక్‌ అంశాలు కూడా సి.ఎఫ్..ఎస్‌కి కారణమవుతాయి. సి.ఎఫ్..ఎస్‌లో పలురకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల పాత్ర ఉన్నా, ఇ.బి.వి (ఎప్‌స్టీన్‌- బార్‌- వైరస్‌) పాత్ర కాస్త ఎక్కువనే అభిప్రాయం పరిశోధకులు వ్యక్తం చేస్తుంటారు.
 
కారణం తెలియడం ముఖ్యం!
నీరసం ఎవరికీ కొత్త అనుభవం కాదు. కాకపోతే, అది ఆరుమాసాల దాకా కొనసాగుతూ పోవడం అన్నది సి.ఎ్‌ఫ.ఎ్‌సగా గుర్తించే సూచన అవుతుంది. ఈ సమస్య రావడానికి ఏదో ఒక కారణం అంటూ ఉండదు. శారీరక, మానసిక కారణాల్లో ఏదైనా ఈ సమస్యకు దారి తీయవచ్చు. కొందరిలో ఈ రెండూ కలగలిసి కూడా ఉంటాయి. ముఖ్యంగా, బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లతో పాటు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, హార్మోన్ల అపసవ్యత, హైపోథైరాయిడిజం, మధుమేహ తీవ్రత వంటి శారీరక కారణాలు, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు వీటిలో ఏవైనా సి.ఎ్‌ఫ.ఎ్‌సకు దారి తీయవచ్చు. సాధారణ మందులు ఎన్ని ఇచ్చినా 30 నుంచి 45 రోజుల పాటు సమస్య కొనసాగుతూనే ఉందీ అంటే, అది సి.ఎఫ్‌.ఎస్‌గా అనుమానించి పూర్తి స్థాయి పరీక్షలు చేయించాలి. సి.ఎఫ్‌.ఎ్‌సలో ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కనిపిస్తుంది. ఆ లక్షణాల వెనుక గల మూల కారణమేమిటో పసికట్టడం చాలా ముఖ్యం. నిజానికి ఈ సమస్యకు ప్రత్యేకమైన వైద్య చికిత్స ఏదీ లేదు. చేసేదంతా లక్షణాల ఆధారంగానే. కాకపోతే, మూల కారణం తెలుసుకున్నాకే ఆ లక్షణాలను తగ్గించే వైద్య చికిత్స అందించాలి. అప్పుడే త్వరితంగా ఆ సమస్యనుంచి విముక్తం అయ్యే అవకాశం ఉంటుంది.
- డాక్టర్‌ జి. హరిచరణ్‌. కన్సల్టెంట్‌ సీనియర్‌ ఫిజిషియన్‌, హైదరాబాద్‌