19 ఏళ్లకే మోకాళ్ల నొప్పులా..? పరిష్కారమిదే..!

 మా అమ్మాయి వయసు పందొమ్మిది. తనకు తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- రామాచార్యులు, ఆదోని 

చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏవైనా ఆరోగ్యపరమైన కారణాలు ఉండవచ్చు. వైద్యులను సంప్రదించి మూలాలను తెలుసుకోండి. ఒకవేళ వాపు వల్లే మోకాళ్ళ నొప్పి   వచ్చి ఉంటే... ఆహార మార్పులతో కొంత ఉపశమనం పొందవచ్చు. ఎముకల దృఢత్వానికి కాల్షియం అత్యవసరం. పాలు, పెరుగు, పనీర్‌, చీజ్‌, ఆకుకూరలు, సోయా, చిక్కుడు గింజలు, బాదం, ఆక్రోట్‌... లాంటి గింజల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఆహారంలోని కాల్షియాన్ని ఎముకలు శోషించుకుని బలపడాలంటే విటమిన్‌-డి కావాలి. రోజూ ఇరవై నిమిషాలు ఎండలో గడిపితే శరీరానికి అవసరమైన విటమిన్‌-డి తయారవుతుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌-సి, విటమిన్‌-కె అధికంగా ఉండే అన్ని పండ్లు, కాయగూరలను రోజూ తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌, స్వీట్లు, చాక్‌లెట్లు, ఫాస్ట్‌ఫుడ్స్‌ వాపును పెంచుతాయి, వీటికి దూరంగా ఉండాలి. ఊబకాయం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నట్టయితే బరువు తగ్గితే ఉపయోగం ఉంటుంది.

 

డా.లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutriful you.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)