ఏ జ్యూస్‌లో ఏముందో!

పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలామంచివి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య కొంతమంది కూరగాయలను కూడా జ్యూస్‌ చేసుకుని తాగడం ప్రారంభించారు. మరికొంతమంది మదుమేహం(షుగర్‌ ) తగ్గడానికి కాకరకాయ జ్యూసు, బరువు తగ్గడానికి బ్రకోలీ జ్యూసంటూ ఎవరి సలహా తీసుకోకుండానే తాగేస్తున్నారు. అయితే ఏ జ్యూసు ఆరోగ్యానికి మంచిదో, ఏది కాదో పూర్తిగా తెలుసుకున్నాకే తాగడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా, నిత్యం యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ఆయా జ్యూస్‌లు మనకు బాగా ఉపయోగపడతాయి. ఏయే జ్యూసులు మన ఆరోగ్యానికి మంచివో తెలుసుకుందాం.

వెజిటబుల్ జ్యూస్
రోజు వారీ ఆహార ప్రణాళికలో భాగంగా కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్కొక్క రకం కూరగాయలో రకరకాల పోషకాలు, మినరల్స్ ఉంటాయి. తద్వారా శరీర జీవక్రియలు నిర్వహించడంలో వాటికి ఒక్కోరకమైన ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని కూరగాయలను వండకుండానే జ్యూస్‌ చేసుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షిస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కీరదోస జ్యూస్‌ను రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కీళ్ల వ్యాధులు ఉన్నవారు రోజూ కీరదోస జ్యూస్ తాగడం మంచిది.
 
టమోటా జ్యూస్
మనం ప్రతిరోజు ఏదో రకంగా టమోటాను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో టమోటా వాడటం వల్ల వంటకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే టమోటాను వంటల్లో కాకుండా జ్యుస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాస్ టమోటా జ్యుస్ త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి కారణంగానే టమోటాకి ఎరుపు రంగు ఉంటుంది. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడతాయి. టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. టమోటాలో సమృద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి

బీట్‌రూట్ జ్యూస్

రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే విధంగా బీట్రూట్ జ్యూస్ లో కూడా లైకోపిన్‌ (lycopene) ఉంటుంది. ఇది రక్త పోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది.
 
తాజా పండ్ల రసాలు 
తాజా పండ్ల నుంచి తీసిన రసాలు అన్నిటికన్నా 100శాతం శ్రేయస్కరం. వీటిలో అనేకరకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-C, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి షుగర్, కాలరీస్ కావలసిన దానికన్నా ఎక్కువగా అందుతాయి. కావున మోతాదును మించి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు పరిశోధకులు. తాజా ఆరెంజ్‌ పండ్ల నుంచి తీసిన జ్యూస్‌ తాగితే శరీరానికి కావలసిన విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది.  విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

రెడ్ గ్రేప్ జ్యూస్

ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రెడ్ గ్రేప్ జ్యూస్‌లో ఎక్కువగా ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కెరోటినాయిడ్స్‌ను పాలిఫెనోల్ గా మార్చుటకు ఉపయోగపడే హైపోన్యూట్రియంట్స్‌ ఇందులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి. రెడ్ గ్రేప్ జ్యూస్‌లో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం కడుపు ఉబ్బరం లేకుండా చూస్తుంది.  కంటి సంరక్షణకు, మోకాళ్ళ సంరక్షణకు, మెదడు చురుకుదనానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
 
క్రాన్ బెర్రీ జ్యూస్
 క్రాన్ బెర్రీ జ్యూస్‌లో  విటమిన్-C ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. విటమిన్ -సి ని అస్కోర్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరం ఎదుగుదలలో, రక్తనాళాల మరమ్మత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. అనేకరకాల జీవక్రియల నిర్వహణలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. ముఖ్యంగా కొల్లాజన్ ఏర్పడడంలో, ఐరన్ గ్రహించుటలో, రోగ నిరోధక శక్తి పెరగడంలో, గాయాలు తగ్గుముఖం పట్టడంలో, ఎముకల పటుత్వానికి ఎంతగానో సహాయపడుతుంది.
 
దానిమ్మ జ్యూస్
చర్మాన్ని సంరక్షించడంలో, క్యాన్సర్ కణాలను బయటకు పంపడంలో దానిమ్మ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కావున శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మరసం క్యాన్సర్‌, ట్యూమర్ల వంటి అనేక రకాల కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లతో సహా ఇది క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గించి, వాటిని నిర్మూలించగలదు. క్యాన్సర్‌ను నిర్మూలించి, నివారించగలిగే సామర్థ్యం దానిమ్మరసంలో ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. దానిమ్మరసం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానిమ్మరసాన్ని తాగడం వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. అంతేకాకుండా ధమనులలో ఉన్న అడ్డంకులు నివారణకు ఇది పనిచేస్తుంది. డయాబెటిక్ రోగులకు ఇతర పండ్లను కాకుండా, దానిమ్మరసాన్ని సిఫారసు చేయవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే  రెండోరకం డయాబెటిస్ లక్షణాలను కూడా నిరోధిస్తుంది.

ద్రాక్ష పండ్ల రసం

ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం ఈ జ్యూస్‌ సేవిస్తే చర్మం సురక్షితంగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
కాక్టైల్ 
కాక్టైల్, మాక్టైల్‌ లాంటి జ్యూసులను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇలాంటివి పేరుకు రుచికరంగా ఉంటాయి కానీ, కృత్రిమ చక్కెరలతో నిండి ఆరోగ్యానికి ముప్పుతెస్తాయి. ఇలాంటి జ్యూసులలో పండ్లరసం తక్కువగా, నీటి శాతం ఎక్కువగా, కృత్రిమ చక్కెరలతో నిండి ఉంటుంది. వీటిలో హై ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌ ( high fructose corn syrup)ను ఎక్కువగా కలుపుతారు. ఇది బరువు పెంచడంలో కీలకపాత్ర పోషిస్తూ, ఊబకాయానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వుశాతం పెంచడానికి, కాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి అనేక తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
 
పచ్చి కాబేజీ, కాలే, బ్రోకోలీ జ్యూసులు
 కాల్సిఫెరోస్ కూరగాయలు అనగా కాబేజీ, కాలే, బ్రకోలీ వంటివి గాయిట్రోజెనిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే గాయిటర్‌ గ్రంథిపై ప్రభావం చూపుతాయి. తద్వారా ఇవి థైరాయిడ్ సమస్యలకు హేతువులుగా ఉంటాయి. ఇవి పచ్చివిగా తీసుకోవడం వలన కడుపులో గ్యాస్ పేరుకుపోవడం, కడుపు ఉబ్బరానికి దారితీయడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ కాల్సిఫెరోస్ కూరగాయలలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నా, వీటిని జ్యూస్ చేసుకుని తాగడం, పచ్చివిగా తీసుకోవడం వల్ల శరీరానికి జరిగే మంచికన్నా చెడే   ఎక్కువ. కాబట్టి వీటిని తీసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా వండుకునే తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
 
ప్యాక్‌ చేసినవి వద్దు!
పండ్లరసాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. పండ్లలో వివిధరకాల ఔషధ గుణాలు, విటమిన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ స్వచ్ఛమైన పండ్లరసాలలో మాత్రమే ఉంటాయి. ప్యాక్ చేసి నిల్వ చేసిన పండ్లరసాల్లో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ శాతం చాలా తక్కువ.  ఈ పాక్ చేసి నిల్వచేసి ఉన్న పండ్ల రసాలలో ఎక్కువగా కృత్రిమ చక్కెరలతో నిండి ఉంటాయి. ఇవి స్థూలకాయానికి ప్రధాన హేతువులుగా పరిణమిస్తాయి. నెమ్మదిగా ఇతర రోగాలకు, అనగా మధుమేహం, కిడ్నీ సమస్యలు రక్త పోటు వంటి సమస్యలకు కూడా కారణమవుతాయి. వీటిలో జ్యూస్ పరిమాణం తక్కువగా, ఇతర అంశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.