గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా..? ఈ ఆహారం తినండి

ప్రశ్న:నాకు యాభై ఏళ్లు. రోజూ గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చోవాల్సి వస్తుంది. పని గంటల్లో ఉత్సాహంగా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- శ్రీనివాస్‌, హైదరాబాద్‌
 

డాక్టర్ సమాధానం: చాలామంది సమయాభావం వల్ల ఉదయం అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల ఆఫీసు పనిపై ధ్యాస ఉండదు. పైగా మధ్యాహ్నానికి బాగా ఆకలి వేస్తుంది. ఉదయం సమయం తక్కువగా ఉంటే ఉడికించిన గుడ్లు, పండ్లు, పాలు లేదా పెరుగు లాంటివి తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనానికి రెండు గంటల ముందు ఐదారు బాదం గింజలు లేదా ఓ పండు తీసుకోండి. భోజనంలో కూర, పప్పుతో పాటు క్యారెట్‌, కీరా, టమోటా లాంటి పచ్చి కూరల మోతాదు పెంచి అన్నాన్ని తగ్గిస్తే మంచిది. సాయంత్రం అయిదారు గంటలప్పుడు గ్లాసు మజ్జిగ, మొలకెత్తిన గింజలు లేదా దానిమ్మ గింజలు తీసుకోవచ్చు. ఇలా సమయానికి తగిన పోషకాహారం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. కాఫీ, టీలు ఉత్సాహాన్నిచ్చినా ప్రభావం తగ్గగానే నీరస పడతారు. అందుకే పాలు, మజ్జిగ, పండ్లు ఉత్తమం. కాసేపు ఎండలో గడిపితే శరీరానికి అవసరమైన విటమిన్‌-డి అంది, ఉత్సాహంగా ఉంటుంది. రోజంతా కూర్చుని ఉంటే రక్తనాళ సమస్యలు రావచ్చు. గంటకోసారి లేచి, ఓ ఐదు నిముషాలు నడవండి. ఉపశమనంగా ఉంటుంది. అలసటా తగ్గుతుంది. 

 

డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected]కు పంపవచ్చు)