యవ్వనంగా కనిపించాలంటే..

ఆంధ్రజ్యోతి(23-6-15): టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి కనిపిస్తుంది. యువతీయువకులు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తీసుకుంటుంటారు. ఇది చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. చర్మం కాంతిని కోల్పోవడం, మొటిమలు రావడం, సరైన పోషకపదార్థాలు అందని కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి టీనేజ్‌లో మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి.

 రోజూ వ్యాయామం చేయాలి. ఎరోబిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి వ్యాయామాల ద్వారా చర్మ గ్రంధులు ఉత్తేజం చెంది చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

చర్మం నిగనిగలాడాలంటే కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా అవసరం. మంచి నిద్రవల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం, చర్మం కాంతి విహీనంగా ఉండటం తగ్గిపోతుంది.

చర్మం ఆరోగ్యంగా ఉండటంలో ఎ, సి, ఇ విటమిన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభ్యమవుతాయి. పాల ఉత్పత్తుల్లోనూ, నట్స్‌లోనూ విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ, నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

 అదనంగా బయోటిన్‌, అరటిపండ్లు, కోడిగుడ్లు, గింజధాన్యాలు, చేపలు, కొవ్వు తొలగించిన మటన్‌, చికెన్‌ తీసుకోవచ్చు.అల్లం, జింక్‌ లభ్యమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం కూడా ఉత్తమం. ఈ విటమిన్లలో యాంటాక్సిడెంట్‌ గుణం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించవచ్చు.