తెల్లసొనా? పచ్చసొనా?.. రెండింటిలో ఏది మంచిది..?

ప్రశ్న: గుడ్డులోని తెల్లసొన మంచిదా? పచ్చసొన మంచిదా?  ఈ విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. తీర్చగలరు.

 - మణి కిశోర్‌

డాక్టర్ సమాధానం: తక్కువ కెలోరీలతో ఎక్కువ పోషక విలువలు, నాణ్యమైన మాంసకృత్తులు అందించే ఆహారం గుడ్డు. ఒక గుడ్డు ద్వారా ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రొటీను, 65 నుంచి 70 కెలోరీలు లభిస్తాయి. తెల్ల సొనలో కొవ్వుపదార్థాలు అసలు ఉండవు. నాలుగు గ్రాముల ప్రొటీను, 17 కెలోరీలు మాత్రమే ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రైబో ఫ్లోవిన్‌, నియాసిన్‌ కొద్ది మోతాదులో లభిస్తాయి. పచ్చసొనలో మూడు నుంచి నాలుగు గ్రాముల ప్రొటీనుతో పాటు నాలుగు గ్రాముల కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. దీంతో గుడ్డు ద్వారా అందే కెలోరీలలో ఎక్కువ భాగం పచ్చ సొన నుంచే వస్తాయి. తెల్లసొనతో పోలిస్తే, పచ్చసొనలో కాల్షియం, ఐరన్‌, జింక్‌, కాపర్‌, థయామిన్‌, బి6, ఫోలేట్‌, బి12 ఎన్నో రెట్లు అధికం. ఎ, డి, ఇ, కె విటమిన్లతో పాటు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా పచ్చసొనలోనే అపారం. అయితే గుడ్డులోని కొలెస్ట్రాల్‌ మొత్తం పచ్చసొనలోనే ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ సమస్య తీవ్రంగా ఉన్నవారు  డాక్టరు సలహా మేరకు మాత్రమే పచ్చసొనను వదిలివేయవచ్చు. మిగిలిన వాళ్లంతా మొత్తంగా గుడ్డును తినడమే మంచిది. 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)