ఏం తిన్నా విరేచనాలు.. ఇక ఏం తినాలి..?

ఆంధ్రజ్యోతి (26-11-2019):

ప్రశ్న: మా పాపకు రెండున్నరేళ్లు. ఇరిటబుల్‌ బవుల్‌ సిండ్రోమ్‌(ఐబీఎస్‌)తో బాధపడుతోంది. ఏం తిన్నా పొట్టలో అసౌకర్యం. విరేచనాలు అయిపోతున్నాయి. పాపకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?      

 - శివ భవి

 
డాక్టర్ సమాధానం: ఐబీఎస్‌ అనేది ఆహారనాళ వ్యాధి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్‌, విరేచనాలు.. దీని లక్షణాలు. ఈ రుగ్మతను నియంత్రించాలంటే, ఏ ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తున్నాయో గుర్తించాలి. అందుకోసం ఫుడ్‌ డైరీ నిర్వహించాలి. పాపకు రోజూ ఏ సమయంలో ఏ ఆహారం ఇస్తున్నారో నమోదు చేసుకోవాలి. ఆ రోజు తన ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను కూడా నమోదు చేసుకోవాలి. సాధారణంగా ఐబీఎస్‌ ఉన్నవారికి పాలలోని లాక్టోజ్‌తో ఇబ్బంది కలుగుతుంది. కనుక పాలు, పాల పదార్థాలు తగ్గించాలి. పలచటి మజ్జిగ కొద్దిగా ఇవ్వవచ్చు. పండ్లలో ఆపిల్‌, పియర్స్‌, మామిడి, ఆల్‌ బుకరా, పుచ్చకాయ పెట్టకూడదు. అరటిపండు, కర్బూజా, దానిమ్మ, కమలా ఇవ్వవచ్చు. గుడ్లు, మాంసం ఇవ్వవచ్చు. కూరగాయలలో క్యాబేజీ, బీట్‌ రూట్‌, ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్‌, పచ్చిబఠాణీ, పుట్టగొడుగు పెట్టకండి. మొలకెత్తిన గింజలు(ఉడికించి), క్యారెట్‌, బంగాళదుంప, దోస, వంకాయ, కీర, ఉల్లికాడలు, బేబీ కార్న్‌, మొక్కజొన్న మంచివే. చపాతీ, ఉప్మా, బిస్కట్లు, బ్రెడ్‌, పాస్తా తదితరాలు వద్దు. బ్రౌన్‌ రైస్‌, కంది, పెసర వంటి పప్పులు, పంచదార, తేనె, బెల్లం మానేయాలి. ఓట్స్‌, తెల్లన్నం పెట్టవచ్చు. వైద్యుల సలహాతో ప్రో బయాటిక్‌ మందులు వాడితే పరిస్థితి తప్పకుండా మెరుగుపడవచ్చు.
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)