విటమిన్లు ఎవరికి అవసరం?

ఆంధ్రజ్యోతి(14-11-15): చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారి వరకూ అందరికీ విటమిన్లు అవసరమే. అయితే ఏ వయస్సులో ఏ విటమిన్లు అవసరమనే విషయంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. చిన్నపిల్లలకు అంటే శిశువు నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు విటమిన్‌-ఎ, విటమిన్‌-సి చాలా అవసరం. ఈ దశలో వారికి సరియైన మోతాదులో విటమిన్లు లభించకపోతే కంటి చూపు తగ్గిపోవడం, రికెట్స్‌, స్కర్వీ అనే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. పెద్దవారిలో విటమిన్స్‌ తగ్గినపుడు అథెరోస్కెలెరోసిస్‌ అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందంటున్నారు. కేన్సర్‌ వంటి వ్యాధులు, ఇమ్యూనిటీ తగ్గడంవల్ల ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎముకలు బలహీనంగా అయి ఆస్టియోపోరోసిస్‌ సమస్య వచ్చే అవకాశం ఎక్కువేనంటున్నారు. ఆస్టియోపోరోసిస్‌ వస్తే ఎముకలు సులువుగా విరిగిపోతాయి. గర్భిణులకు ఫోలిక్‌యాసిడ్‌ అనే విటమిన్‌ మాత్రలు అవసరమవుతాయి. ఈ విటమిన్‌ లోపిస్తే పుట్టబోయే శిశువుల్లో అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. ఇక శాఖాహారుల్లో  విటమిన్‌-బి12 లోపం ఉంటుంది. దీనివల్ల రక్తం తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మాత్రల రూపంలో ఆ లోటును భర్తీ చేసుకోవాలని అంటున్నారు. అయితే విటమిన్‌ మాత్రలను వైద్యుల సలహా మేరకు వాడటమే ఉత్తమం అని సూచిస్తున్నారు.