ఆంధ్రజ్యోతి(7-10-15): ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని పోషకాలు సీడ్స్‌లో లభిస్తాయి. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. ఒకేరకం కాకుండా మిక్స్డ్ సీడ్స్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాంటి కొన్ని సీడ్స్ విశేషాలు ఇవి...
చియా సీడ్స్
వీటిలో ఒమెగా 3, ఫైబర్, ప్రొటీన్, మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్, పొటాషియం, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 28గ్రాముల చియా విత్తనాల్లో 5 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. రోజూ తీసుకోవాల్సిన కాల్షియంలో 18 శాతం, మెగ్నీషియం - మాంగనీస్ 30 శాతం, 27 శాతం పాస్ఫరస్ లభిస్తాయి. చియా సీడ్స్ డైట్లో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎముకలు బలపడతాయి. కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి. డయాబెటిస్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
అవిసెలు
వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బ్లడ్‌షుగర్ నియంత్రణలో ఉంటుంది. కేన్సర్‌ను నిరోధించే గుణం వీటిలో ఉంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
నువ్వులు
వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాపర్, మెగ్నీషియం అత్యధికంగా
లభిస్తుంది. ఐరన్, పాస్ఫరస్, జింక్, ఫైబర్ కూడా లభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా కేన్సర్ ప్రివెన్షన్‌గా
పనిచేస్తాయి.
గుమ్మడి విత్తనాలు
ఇందులో ఉన్న ఫ్యాటీయాసిడ్స్ రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఈ గింజల్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అత్యధికంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఎల్-ట్రిప్టోపన్ అనే అమైనోయాసిడ్ డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. ప్రొస్టేట్, హార్ట్ హెల్త్‌కు గుమ్మడి విత్తనాలు బాగా పనిచేస్తాయి. విటమిన్ బి లోపంతో బాధపడే వారు ఈ విత్తనాలు తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసే గుణం కూడా ఈ విత్తనాలకు ఉందని పరిశోధనల్లో తేలింది.
పొద్దు తిరుగుడు విత్తనాలు
వీటిలో విటమిన్ ఇ ఎక్కువగా లభిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. యాంటీఏజింగ్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో ఈ విత్తనాలు ఉపకరిస్తాయి. వీటిలో ఫోలేట్ లభిస్తుంది కాబట్టి గర్భిణిలకు ఇది మంచి ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఆస్తమా తీవ్రతను తగ్గిస్తుంది. హార్ట్ఎటాక్, స్ట్రోక్స్ రిస్క్తగ్గుతుంది.