వేప దివ్యౌషధం

ఆంధ్రజ్యోతి(6-11-15): ఔషధ విలువలు, సౌందర్య ప్రయోజనాలు సమంగా గల అరుదైన చెట్టు  వేప. దీని ఆకులు, కాండం, నూనె,  పూలు,  గింజలు, పండ్లు  ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

సంప్రదాయంగా వేప ఆకులతో తయారు చేసే ఔషధాలు మలేరియా, మధుమేహం, గుండె జబ్బులు, చర్మవ్యాధులకు ఉపయోగపడుతూ వ చ్చాయి. గర్భనిరోధకంగా పనికొచ్చే అంశాలు కూడా వేపలో ఉన్నాయి. యాంటీ అల్సర్‌, యాంటీ ఫంగ్‌సగా ఉపయోగపడే మూలకాలు కూడా వేపలో ఉన్నాయి. అల్సర్లను నయం చేయడంతో పాటు వేపాకుకు అజీర్తి సమస్యను నిర్మూలించే గుణం కూడా ఉంది. ప్రతి రోజూ వేపాకును వాడుతూ ఉంటే, కేన్సర్‌ కణాలు బహుముఖంగా విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయి. వేపకు సంబంధించిన వివిధ భాగాలను తీసుకోవడం వల్ల కేన్సర్‌ కణజాలం పెరగడం ఆగిపోతుంది. 

ఫ్లూ, కొన్ని ఇతర జ్వరాల్ని తగ్గించడంలో వేప ఔషధాలు ముందు వరుసలో ఉంటాయి. వేప పేస్ట్‌ యాంటీ- బ్యాక్టీరియల్‌  నిర్మూలకంగా పనిచేయడంతో పాటు, స్వల్పంగా ఉన్న చర్మ సంబంధితమైన ఇన్‌ఫెక్షన్లను, గాట్లను, పుండ్లను మాన్పడంలో బాగా ఉపయోపడుతుంది..

 ఇన్సులిన్‌ రిసెప్టార్లను చైతన్యపర్చడం ద్వారా వేప ఆకులు రక్తంలోని షుగర్‌ నిలువల్ని తగ్గిస్తాయి.  దీనికి తోడు ఆధునిక వైద్యానికి సంబంధించిన యాంటీ-డయాబెటిక్‌ మందుల మీద ఆధారపడటాన్ని బాగా తగ్గిస్తూ మధుమేహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేప నూనె దోమల్ని తరిమి కొట్టే రిపెల్‌గా కూడా ఉపయోగపడుతుంది.

సౌందర్య పోషణకు
వేపాకులో ఉండే యాంటీ- బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌  అంశాల కారణంగా పలు రకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు,  మొటిమలకు, దద్దుర్లకు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.  వేప నీరును చర్మపు బిగువును పెంచే స్కిన్‌ టోనర్‌  కూడా. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతి వంతంగా మారుతుంది. పొడి చ ర్మపు సమస్యను కూడా ఇది పోగొడుతుంది. తలకు వేపాకు పట్టించడం ద్వారా  తల మీదున్న  దురద, చుండ్రు సమస్యలు తొలగిపోవడంతో పాటు జుత్తు కూడా బాగా పెరుగుతుంది.