టీనేజీ పిల్లలకు విటమిన్ సప్లిమెంట్లు ఇవ్వొచ్చా..?

 

 ఆంధ్రజ్యోతి (03-11-2019): 

ప్రశ్న: టీనేజీ పిల్లలకు విటమిన్‌ సప్లిమెంట్లు ఇవ్వవచ్చా?

- కౌసల్య, విజయవాడ

సమాధానం: పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఆత్రుత తల్లిదండ్రులకు సహజమే. అవసరమైన మోతాదులో విటమిన్లను, ఖనిజాలను ఏదో ఓ రూపంలో అందించకపోతే టీనేజీ పిల్లల్లో పోషకాహార లోపం రావచ్చు. ఆహారపు అభిరుచులు, అలవాట్లు, చదువు, పరీక్షల ఒత్తిడి తదితరాల వల్ల పిల్లలకు ఒక్క భోజనం ద్వారానే అన్ని పోషకాలూ అందించలేం. అందుకే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. ఫాస్ట్‌ ఫుడ్స్‌, బేకరీ రుచులు, స్వీట్లు, కూల్‌ డ్రింకులు, చిప్స్‌, చాకోలెట్స్‌ లాంటి వాటివల్ల కావలసిన శక్తి వచ్చినా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందవు. అందుకే వీరికి అందించే చిరుతిళ్లు కూడా ఆరోగ్యకరమైనవే అయి ఉండాలి. పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించాలి. వేయించిన పల్లీలు, సెనగలు, ఉడికించిన గింజలు, బాదం, ఆక్రోట్‌, పండ్లు లాంటివి అలవాటు చేస్తే మంచిది. అయినా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినట్టు అనిపించినా, పిల్లల్లో చురుకుదనం తగ్గినా నిపుణుల సలహా మేరకు మాత్రమే విటమిన్‌ సప్లిమెంట్లను ఇవ్వాలి. వారు సూచించిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. అధికంగా సప్లిమెంట్లను వాడినా కూడా ప్రమాదమే. 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)