ఆరోగ్యం వంటింట్లో...

ఆంధ్రజ్యోతి (06-11-2019): చిన్న చిన్న రుగ్మతలు వచ్చినా ఆస్పత్రికి పరుగులు పెడతాం. కానీ వాటిని తగ్గించే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి. వంట దినుసుల గుణాలను గుర్తించి, రుగ్మతలకు తగినట్టు వాడుకుంటే స్వల్ప రుగ్మతలను ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు.

 
యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌: జలుబు, గొంతునొప్పి, మొటిమలు, స్థూలకాయాన్ని తగ్గించే యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను ఫేసియల్‌ టోనర్‌గా ఉపయోగిస్తే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. దీంతో వెంట్రుకలను కడిగితే పట్టుకుచ్చులా మారతాయి. సలాడ్స్‌, డ్రింక్స్‌లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
 
పుదీనా: మొటిమలను తగ్గించే పుదీనా కడుపు ఉబ్బరం, తలతిరుగుడు, వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది. వేడి నీళ్లలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి, ఆ నీటితో స్నానం చేస్తే చర్మం శుభ్రపడుతుంది.
 
మెంతులు: మెంతులతో జీర్ణసంబంధ సమస్యలు తొలుగుతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇందుకోసం మెంతులు నానబెట్టిన నీళ్లను తాగాలి. వీటిని ముద్ద చేసుకుని ముఖానికి, వెంట్రుకలకు పూసుకోవాలి.
 
జీలకర్ర: వ్యాధినిరోధకశక్తిని పెంచే గుణం కలిగి ఉంటుంది. ఛాతీలో మంట తగ్గడం కోసం జీలకర్ర నమలాలి. జీలకర్ర టీ తాగితే కమ్మని నిద్ర పడుతుంది.
 
సోంపు: నెలసరి నొప్పులు, నోటి దుర్వాసన తొలగించడంతో పాటు, శరీరంలోని విషపదార్థాలను బయటకు వెళ్లగొట్టే గుణం సోంపు సొంతం. భోజనం తర్వాత సోంపు నమలాలి. సోంపుతో టీ తాగాలి. సోంపును నీళ్లలో మరిగించి తాగితే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.