అజీర్తికి అడ్డుకట్ట

29-10-2019: ఆకలి.. తీసుకున్న ఆహారం జీర్ణం కావడం... మలమూత్ర విసర్జన... ఇవన్నీ జీర్ణమండల విధుల్లో అత్యంత కీలకమైనవి. మౌలికంగా మనిషికి ఆకలిని కలిగించే ప్రధాన కారణభూతం మెదడులోని ‘హైపోథాలమస్‌’. ఇది నాడులు, హార్మోన్ల ప్రభావంతో పనిచేస్తుంది. జీర్ణమండలంలోని ఆయా భాగాలు, వాటి విధులను ఏమాత్రం సక్రమంగా నిర్వహించకపోయినా, వెనుకో ముందో మనిషి ఏదో ఒక వ్యాధి బారిన పడటం ఖాయం. అందువల్ల జీర్ణవ్యవస్థలో కనిపించే తేడాలు, లోపాలను ఎప్పటిక ప్పుడు గమనిస్తూ, అవసరమైన వైద్య చికిత్సలను వెనువెంటనే తీసుకోవడం చాలా అవసరం. 

వైద్యపరంగా.....

సరిపడా నిద్ర, నిర్దిష్ట వేళల్లో భోజనం లేకపోవడం వంటి కారణాలతో ఛాతిలో మంట, కడుపులో బరువు, జీర్ణం కాని పదార్థాలు వాంతి కావడం, మాటిమాటికీ విరేచనానికి వెళ్లాలనే భావన కలిగే వారికీ, టీ, కాఫీలు, పొగాకు మత్తు పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల అజీర్తి, పుల్లటి తేన్పులు వస్తున్న వారికీ ‘నక్స్‌ వామికా - 30’ మందు బాగా పనిచేస్తుంది.

పుల్లటి తేన్పులు, వాంతులు, భోజనం తర్వాత కడుపులో బరువు, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం, తలనొప్పి ఉంటే ‘నేట్రంఫాస్‌-30’ మందు వేసుకోవాలి.
కొవ్వు పదార్థాలు, నూనెలు, కేకులు, స్వీట్స్‌ అతిగా తినడం వల్ల కలిగే అజీర్తి బాధలకు ‘పల్సటిల్లా - 30’ చక్కని మందు.

పొట్టలో వాయువు ఎక్కువగా చేరి కొందరికి బాగా ఆకలి అనిపిస్తుంది. కానీ, కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం, పొత్తికడుపులో బరువు, తేన్పులు, తరచూ అపాన వాయువులు విడుదల కావడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ‘లైకోపోడియం - 30’ మందులు ఉపశమనం కలిగిస్తాయి.

నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల కలిగే బాధలకు, పుల్లటి వాంతులు, తేన్పులకు, తీపి పదార్థాలు తినగానే పులిసిన లక్షణాలు, ఛాతిలో మంట వంటి లక్షణాలకూ సల్ఫర్‌- 30 మందు బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ‘కాల్కేరియా కార్బ్‌ - 30’ మందు వేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ఆకలి మందగించడం, వికారం, నీళ్ల విరేచనాలు, కడుపులో మంట, పుల్లటి పండ్లు, మత్తు పానీయాలు సేవించడం వల్ల కలిగే బాధలకు ‘ఆర్సెనిక్‌ ఆల్బ్‌ - 30’ మందు ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. అజీర్ణం, వికారంతో పాటు వాంతులు, అజీర్ణ విరేచనాలు, వెక్కిళ్లు ఉంటే ‘ఇపికాక్‌ - 30’ మందు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.