వెజిటబుల్స్‌ తినాల్సిందే!

ఆంధ్రజ్యోతి (19-11-2019):చాలామంది కూరగాయలు తినేందుకు ఇష్టపడరు. వాటి బదులు జంక్‌ఫుడ్‌, బేకరీ ఉత్పత్తుల మీద ఆసక్తి చూపుతారు. కానీ ఆహారంలో వెజిటబుల్స్‌ తగ్గించడం వల్ల చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. భోజనంలో కూరగాయలు తగ్గితే వచ్చే ఇబ్బందులివి....

 
అలసట: శరీరానికి కొద్దిసేపు విశ్రాంతి కావాలనే సంకేతమే అలసట. ఇది అందరిలోనూ కనిపిస్తుంది. అయితే తరచుగా అలసటకు గురవుతున్నారంటే మీరు తగినన్ని కూరగాయలు తినడం లేదని అర్థం. అందుకే ఆకుకూరలు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే కిడ్నీబీన్స్‌, పప్పు ధాన్యాలు, పుట్టగొడుగులు తినాలి. వీటిలోని విటమిన్‌ బి, ఐరన్‌ అలసటను మాయం చేస్తాయి.
 

రోగనిరోధకశక్తి తగ్గడం: వాతావరణం కొద్దిగా మారితే చాలు కొందరిలో తమ్ములు, దగ్గు వస్తాయి. దీనికి కారణం వ్యాధినిరోధక శక్తి తగ్గడం. ఇలాంటప్పుడు ఆహారంలో విటమిన్‌ సి అధిక మొత్తంలో ఉండే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

జ్ఞాపకశక్తి తగ్గడం: ఏదైనా విషయాన్ని గుర్తుకుతెచ్చుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా! డైట్‌లో వెజిటబుల్స్‌ తగ్గడం వల్ల వచ్చే ఈ సమస్య తగ్గాలంటే క్యారెట్లు, బ్రకోలి, మొక్కజొన్న, టొమాటో, వంటివి ఎక్కువగా తినాలి.
 
ఎర్రమచ్చలు: కూరగాయలు తింటే ప్రొటీన్లు, మినరల్స్‌, విటమిన్స్‌తో పాటు అన్నిరకాల పోషకాలు అందుతాయి. అయితే వీటిని తగ్గిస్తే అనారోగ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. విటమిన్‌ సి లోపం వల్ల చర్మం మీద దద్దుర్ల మాదిరి మచ్చలు ఏర్పడతాయి. చర్మం మీద చాలా చోట్ల ఈ మచ్చలు ఏర్పడినప్పుడు రెడ్‌ క్యాప్సికమ్‌, కాలే, బ్రకోలి, ముదురు రంగు కూరగాయలు ఎక్కువగా తింటే సమస్య తగ్గుతుంది.