తృణమే ఘనం!

ఆంధ్రజ్యోతి (09-12-2019): ఆధునిక జీవనశైలితో మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్లు వంటి దీర్ఘకాలిక జబ్బుల తాకిడి ఎక్కువవుతోంది. స్థూలకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం తినాలి? ఏది తినకూడదు? మన ఆహార పద్ధతులు సరైనవేనా? రోజుకో సిద్ధాంతం, వారానికో వాదన పుట్టుకొస్తున్న ఈ తరుణంలో... ‘మన పూర్వీకులు పాటించిన ఆహార పద్ధతుల్ని అనుసరించడమే బెస్ట్‌’ అంటున్నారు డాక్టర్‌ సత్యలక్ష్మి. పుణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతీ’ సంస్థకు ఆమె డైరెక్టర్‌. ఆ పదవిని అందుకున్న తొలి తెలుగు మహిళ. సుస్థిరమైన ఆరోగ్యం కోసం, సహజమైన ఆహారం గురించీ ఆమె ఏం చెబుతున్నారంటే...

‘‘ఆరోగ్యవంతమైన జీవనంలో ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది. మీరు తినే ఆహారాన్ని బట్టే మీ శారీరకస్థితి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే మన పొట్ట రెండో మెదడులా పనిచేస్తోందని ప్రకృతి వైద్యశాస్త్రం నిర్వచిస్తోంది. మనం తీసుకునే ఆహారానికి, మన ఆలోచనలకు అవినాభావ సంబంధం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. జీర్ణక్రియ పనితీరులో గట్‌ మైక్రోబయోటా, బ్యాక్టీరియా కీలకపాత్ర పోషిస్తుంది. యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా తీసుకున్నప్పుడుగానీ, క్రిమిసంహారక మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు గానీ ఆ గట్‌ బ్యాక్టీరియా రసాయన చర్య మందగిస్తుంది. అది మెదడులోని రసాయన చర్యలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కోపం, చిరాకు, నిస్సత్తువ, భావోద్వేగాలు అదుపు తప్పడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే వీలైనంతవరకూ సాత్విక ఆహారం తీసుకోవాలని యోగ శాస్త్రం సూచిస్తోంది.
 
బియ్యం, గోధుమలు హాని చేస్తాయి!
బియ్యం, గోధుమలను ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా మంచిది కాదు. వరి, గోధుమల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆర్సెనిక్‌ అనే పదార్ధం ఉందని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఆర్సెనిక్‌ వల్ల గోధుమ, బియ్యంలో థయామిన్‌ (విటమిన్‌ బీ1) చాలా తక్కువగా ఉంటోందని గుర్తించారు.
 
నిజానికి శరీరంలో బ్లడ్‌ గ్లూకోజ్‌ను అదుపుచేసే ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపరచడంలో థయామిన్‌ది కీలకపాత్ర. బియ్యం, గోధుమల్లో కన్నా తృణధాన్యాల్లో ఈ థయామిన్‌ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొర్రల్లో ‘విటమిన్‌ బీ1’ సమృద్ధిగా ఉంటుంది. మన దేశంలో అరవై శాతం వర్షాధార పంటలు పండే భూమి ఉంది. వరి, గోధుమ సాగుకు నీటి అవసరం ఎక్కువ. అందుకే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఒరగలు వంటి తృణధాన్యాల సాగు పెరగడం వల్ల రైతులకు, పర్యావరణానికి లాభం. ఏది ఏమైనా మన బామ్మలు, తాతయ్యలు అవలంబించిన ఆహార పద్ధతుల్ని ఇప్పుడు మనం అనుసరిస్తే నేటి జీవనశైలి వల్ల వచ్చే ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అదుపుచేయవచ్చు. ఈ విషయాన్నే మేము ప్రచారం చేస్తున్నాం. మన పూర్వీకుల ఆహార పద్ధతులను తిరిగి మనం పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం.
 
తృణధాన్యాలే పరిష్కారం!
అత్యధిక పోషక విలువలు ఉన్న తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడమే ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. కొన్నిరోజుల క్రితం మేము తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న ఆహారం తింటున్న కొంత మంది పిల్లల మీదా, తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటున్న మరికొంతమంది చిన్నారుల మీదా అధ్యయనం చేశాం. తృణధాన్యాలు తీసుకుంటున్న పిల్లల ఎదుగుదలలో మార్పులను గమనిస్తే, వారు చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారు.
 
మట్టి పాత్రలే మేలు!
తినే తిండితో పాటు మనం ఆహారాన్ని వండే పద్ధతి కూడా మార్చుకోవాలి. వంటకు అల్యూమినియం పాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టీలు పాత్రలు కొంతవరకు నయమే. మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆహార పదార్థాల్లోని ఆర్సెనిక్‌ను ఆ పాత్ర గ్రహిస్తుంది. అందుకే మట్టి పాత్రలను వంటకు ఉపయోగించడం ఉత్తమం అని చెప్పొచ్చు. నల్ల నువ్వులు, అవిసె గింజలు, పల్లీలు వంటి వాటితో తయారు చేసిన వంట నూనెలను వాడటం మంచిది. తక్కువ ధరకే ఇంట్లోనే వంట నూనె తయారుచేసుకునే యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
 
‘కీటో డైట్‌’ విషయంలో...
కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చన్న ప్రచారం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. దీన్నే ప్రకృతి వైద్యశాస్త్ర పరిభాషలో ‘కీటో డైట్‌’ అంటారు. దీనిలో భాగంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా మానేస్తాం. మనం తీసుకునే కొవ్వు పదార్థాల్లో ఎంతో కొంత ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి అవి మన శరీరానికి సరిపోతాయి. అయితే, దీని వల్ల శరీరం ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంది. తద్వారా కాలేయం, మూత్రపిండాలపై భారం ఎక్కువవుతుంది. కిడ్నీ, లివర్‌ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఆహారం తీసుకోకూడదు. అందుకే ఎవరు పడితే వాళ్ళు కీటో డైట్‌ పాటించవచ్చని చెప్పడం సరైంది కాదు. ఇలాంటి ఆహారపుటలవాట్లను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పాటించాలి.
 
శాకాహారమే ఉత్తమం!
‘శాకాహారమే ఉత్తమం’ అని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ప్రకృతి నుంచి ఎనర్జీని అందుకోవడంలో మొక్కలు తొలి దశలో ఉంటే, జంతువులు, పక్షుల లాంటి వాటితోపాటు మనుషులమైన మనం రెండో దశలో ఉన్నాం. పశువులు గడ్డి తిని జీవిస్తాయి. పులులు, సింహాలు మాంసాహారం తిని మనుగడ సాగిస్తాయి. అంటే వాటి శరీరాకృతికి అనుగుణంగా ఆహార అలవాట్లు ప్రకృతి నియమం ప్రకారం సాగుతున్నాయి. ప్రొటీన్ల కోసం మాత్రమే మాంసం తినాలనడం కూడా సరైందికాదు. మేకలు, ఇతర జంతువులు, కోళ్ల పొట్టలో కొన్నిరకాల విషపదార్థాలు (టాక్సిన్స్‌) ఉంటాయి. వాటి మాంసం తినడం ద్వారా అవి మన శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ‘మనుషులు శాకాహారం మాత్రమే ఎందుకు తినాలి?’ అనే అంశంపై అడాల్ఫ్‌ ‘రిటర్న్‌ టు నేచర్‌’ ఆనే పుస్తకంలో ప్రత్యేకంగా వివరించారు. ఆ పుస్తకం మహాత్మాగాంధీని అత్యంత ప్రభావితం చేసింది. ఆ తర్వాతే గాంధీ నేచురోపతిని తన జీవితంలో భాగం చేసుకున్నారు.’’
 
‘సహజాహార పండుగ’ లక్ష్యం అదే!
‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి’ (ఎన్‌.ఐ.ఎన్‌) దేశంలోని మరికొన్ని ప్రకృతి చికిత్సాలయాలతో కలిసి ప్రతి ఏటా ‘సహజాహార పండుగ’ను నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుగ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా జాతీయ స్థాయి తృణధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వైద్యశాలల విద్యార్థినులూ తమ రాష్ట్రాల్లో సుస్థిరారోగ్యం కోసం అక్కడి వారు అవలంబిస్తున్న ఆహార పద్ధతులను ఈ పండుగలో వివరిస్తుంటారు. ఆధునిక జీవనశైలితో తలెత్తే జబ్బుల ధాటిని ఎదుర్కోవడానికి... వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాల వాడకమే పరిష్కారమని ఎన్నో అధ్యాయనాల్లో తేలింది. ఈ విషయాల గురించి ప్రచారం చేయడంతోపాటు సహజాహారం అంటే ఏమిటో, దాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎలాంటివో చెబుతున్నాం. తృణధాన్యాలతో రకరకాలైన వంటల్ని రుచికరంగా ఎలా వండుకోవచ్చో కూడా వివరిస్తున్నాం.
 
-కె. వెంకటేశ్‌