ఇంట్లోనే మీల్‌ రిప్లేస్‌మెంట్‌

20-09-2019: బరువు తగ్గడానికి ‘మీల్‌ రిప్లేస్‌మెంట్‌’ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి?
- సత్య, హైదరాబాద్‌
 
సాధారణంగా రోజూ తీసుకునే ఆహారం తింటే బరువు తగ్గరని ‘మీల్‌ రిప్లే్‌సమెంట్‌’ చేస్తుంటారు. ఇవి సాధారణంగా మార్కెట్లో ఫార్ములా రూపంలో లభిస్తాయి. ‘మీల్‌ రిప్లే్‌సమెంట్స్‌’లో ముఖ్యంగా ఫైబర్‌, ఎనర్జీ, ప్రొటీన్‌, ఫ్యాట్‌, మినరల్స్‌, విటమిన్స్‌, సాల్ట్స్‌ సమపాళ్లలో ఉండటం వల్ల ఆకలి వేయకుండా కొంత సమయం ఉండగలుగుతాం. అయితే ఇలాంటి ‘మీల్‌ రిప్లే్‌సమెంట్స్‌’ను ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసుకోవడం వల్ల రుచి మనకు ఇష్టమైనట్టుగా ఉంటుంది. ఫార్ములాలా కాకుండా హోల్‌సమ్‌ మీల్‌లా ఉంటుంది. దీన్ని ఫాలో అవ్వడం తేలిక. అలాగే బరువు తగ్గుతారు కూడా.
 
సాధారణంగా ఏదో ఒక మీల్‌ మాత్రమే మీల్‌ రిప్లే్‌సమెంట్‌ చెయ్యాలి. లంచ్‌ లేదా డిన్నర్‌ అయితే మంచిది. ఎక్కువ బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ బరువు ఉన్నవారు రెండు మీల్‌ రిప్లే్‌సమెంట్స్‌ చెయ్యొచ్చు. అయితే అది బ్రేక్‌ఫాస్ట్‌ లేదా డిన్నర్‌ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే రెండు ‘మీల్‌ రిప్లే్‌సమెంట్స్‌’ మధ్య ఒక సాధారణ మీల్‌ తప్పకుండా ఉండాలి. ‘మీల్‌ రిప్లే్‌సమెంట్స్‌’ ద్రవ రూపంలోగానీ, ఘన రూపంలోగానీ ఉండొచ్చు. ఇవి ఎప్పుడు కూడా మనల్ని శక్తివంతంగా ఉంచేలా చూడాలి. అంతేగానీ నీరసం రాకూడదు. నీరసం వచ్చిందంటే అది మనకు సరిపోవడం లేదని గ్రహించాలి.
 
ఇంట్లో తయారుచేసుకోవడానికి ఒక ‘మీల్‌ రిప్లే్‌సమెంట్‌’:
స్మూతీ
 
కావాల్సినవి: రెండు టేబుల్‌ స్పూన్ల ఉడకబెట్టిన ఓట్స్‌, ఒక టీ స్పూన్‌ గుమ్మడి గింజలు, ఒక టీ స్పూన్‌ నువ్వులు, అర టీ స్పూన్‌ అవిస గింజలు, రెండు నల్లఖర్జూరాలు, పది నల్ల ఎండుద్రాక్ష, సగం ఆపిల్‌ లేదా అరటిపండు, కప్పు పెరుగు, సరిపడా నీళ్లు.
తయారీ: అన్నింటినీ కలిపి గ్రైండర్‌లో బ్లెండ్‌ చేసుకుని వెంటనే సేవించాలి. ఓట్స్‌కు బదులుగా రెండు టేబుల్‌ స్పూన్ల రాగిపిండి ఉడికించి ఉపయోగించొచ్చు. ఈ స్మూతీని రెగ్యులర్‌ బ్రేక్‌ఫా్‌స్టకి బదులుగా తీసుకోవచ్చు. లేదంటే లంచ్‌కి బదులుగా, సాయంత్రం వర్కవుట్‌ అనంతరం దీన్ని మీల్‌గా తీసుకుని, నిద్రపోయే ముందు ఒక పండు, కప్పు పాలు తాగితే సరిపోతుంది. ఈ మీల్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు.
 
డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్