కంటిచూపును పెంచే అరటి

ఆంధ్రజ్యోతి(17-10-2016): తిన్న ఆహారం సులువుగా జీర్ణం చేయటానికి, తక్షణ శక్తి ఇవ్వటానికి ఉపయోగపడే అరటిపండు కంటి ఆరోగ్యానికీమంచిదని తాజా సర్వేలో తేలింది.ప్రతిరోజూ ఓ అరటిపండు మన మెనూలో ఉంటే కంటికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. చక్కని కంటిచూపుతో పాటు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ అరటిని తీసుకుంటే మంచిదని వారంటున్నారు. అరటిలో ఉండే కెరొటినాయిడ్స్‌ లివర్‌నే కాదు కంటిచూపునూ కాపాడుతుంది. ఇంతకుముందు వచ్చిన సర్వేల్లో పండ్లలో అధికంగా ఉండే కెరొటినాయిడ్స్‌ కారణంగా క్రానిక్‌ డిసీజ్‌లతో పాటు క్యాన్సర్స్‌ కూడా రావని తేలింది. అయితే ఈ తాజా సర్వేలో అరటిపండ్లలో రిచ్‌ ప్రొవిటమిన్‌ ఎ కెరొటినాయిడ్స్‌ అధికంగా ఉంటాయని తేలింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీ పరిశోధకులు అరటిపై పరిశోధన చేశారు. అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండు పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మొత్తానికి కంటిచూపు సమస్యలు రాకుండా ఉండాలంటే అరటితో నేస్తం చేయాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.