జామకాయ తింటున్నారా

ఆంధ్రజ్యోతి,22-8-2016:తీపి, వగరు, పులుపు.. మూడు రుచుల కలయిక జామ. పచ్చికాయ కోసుకుని రవ్వంత ఉప్పు, చిటికెడు కారం చల్లుకుని తింటే.. ఆ రుచి ముందు ఆపిల్‌ కూడా బలాదూర్‌. రుచి ఒక్కటే కాదు.. అత్యంత చౌకధరలో దొరికే జామలో ఖరీదైన పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. అవేంటంటే..

 మిగిలిన పండ్లలో కంటే విటమిన్‌ సి, ఇనుము జామలోనే అధికం. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు రాకుండా జామ కాపాడుతుంది. ఎందుకంటే ఇందులోని విటమిన్‌ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి. పచ్చి జామ జ్యూస్‌ తాగితే మరీ మంచిది. 
లావు తగ్గడానికి రకరకాల ఖరీదైన మార్గాలను ఎంచుకున్నా కొన్నిసార్లు ఫలితం ఉండదు. రోజుకు ఒక జామపండు తింటే అధిక బరువు సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. జామలో ప్రొటీన్లు, విటమిన్లతో పాటు అధిక పీచుపదార్థం శరీరానికి లభిస్తుంది. ఇది జీర్ణప్రక్రియను చురుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
ఆపిల్స్‌, బత్తాయి, ద్రాక్షలతో పోలిస్తే.. పచ్చిజామలోనే షుగర్‌ తక్కువ మోతాదులో ఉంటుంది. మధుమేహులు తినడానికి ఏ ఇబ్బందీ ఉండదు.
 
మెదడులోని నరాలకు రక్తప్రసరణ సాఫీగా సాగడానికి విటమిన్‌ బి3, బి6 ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి రెండూ జామలో అధికం. జామలోని మెగ్నీషియం కండరాలకు, నరాలకు ఉపశమనం ఇస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి రోజుకొక జామ తింటే ఎంతో మేలు.
 
పళ్లనొప్పికి జామ ఆకు దివ్యౌషధం. పచ్చి జామ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లు, చిగుళ్లకు పట్టించుకుంటే.. నోటిలోని చెడు బ్యాక్టీరియా పోతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తద్వార పంటినొప్పి ఉండదు.
 
కంటి చూపునకు విటమిన్‌ ఎ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం సహజం. ఈ సమస్యలను అధిగమించడానికి క్యారెట్‌తోపాటు జామ చేసే మేలు అంతాఇంతా కాదు.
 
శరీరంలో తలెత్తే పలు సమస్యలకు మలబద్ధకం కారణం. ఎందుకంటే మనం తినే తిండిలో పీచుపదార్థాలు అతి తక్కువ. జామ ఆ సమస్యకు చెక్‌ పెడుతుంది. ఒక జామలో రోజుకు ఒక వ్యక్తికి కావాల్సిన పీచుపదార్థంలో సుమారు 12 శాతం లభించినట్లే.
 
గుండె ఆరోగ్యానికి సోడియం, పొటాషియం ముఖ్యమైనవి. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు దోహదం చేస్తాయవి. లేకుంటే అధిక ఒత్తిడికి గురైనప్పుడు హైపర్‌టెన్షన్‌ వంటివి చుట్టుముడతాయి. జామతో అది తగ్గుతుంది. దీంతోపాటు గుండెజబ్బులకు కారణమయ్యే ట్రైకోగ్లిజరైడ్స్‌, ఎల్‌డిఎల్‌ (చెడుకొవ్వు)లను అడ్డుకుంటుంది జామపండు. తద్వారా మంచి కొవ్వు (హెచ్‌డిఎల్‌) పెరుగుతుంది.