జుట్టు తెల్లబడుతోంది. ఆహారాన్ని మారిస్తే సరిపోతుందా?

 ప్రశ్న: మా పాపకు ఎనిమిదేళ్లు. ఈమధ్య తనకు జుట్టు తెల్లబడుతోంది. ఆహారంలో మార్పులతో దాన్ని ఆపవచ్చా?

- నారాయణ, విజయవాడ 
 

డాక్టర్ సమాధానం: మధ్య వయసు దాటిన తరువాత వెంట్రుకలు నెరవడం సర్వసాధారణం. చిన్న వయసులో అయితే దాన్ని బాల నెరుపు అంటారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యా లేనప్పటికీ ఎదుగుతున్న కొద్దీ పిల్లలు మానసికంగా ఇబ్బంది పడవచ్చు. జన్యుపరమైన కారణాలు; ఆరోగ్య సమస్యలు; బి- 12 విటమిన్‌, ఐరన్‌ లోపం; ఆందోళన; షాంపూలు పడకపోవడం... ఇలా వివిధ కారణాల వల్ల బాలనెరుపు రావచ్చు. బి- 12 కోసం పాలు, పెరుగు, మాంసం, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇనుము కోసం రోజూ ఆకుకూరలు తినాలి. ఖనిజాలు పుష్కలంగా అందడానికి గింజలు మంచివి. ఇక మాంసకృత్తుల కోసం మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు తినాలి. ఈ పదార్థాలన్నీ సమస్యను అధిగమించడానికి ఉపయోగపడతాయి. మంచి ఆహారం, జీవన శైలిలో మార్పుతో కొంత వరకు సమస్య అదుపులోకి వచ్చినా, వైద్యుల సలహాతో శాస్త్రీయమైన పరిష్కారం పొందడమే మంచిది. 

డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected]కు పంపవచ్చు)