బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ మంచిదేనా?

 

ఆంధ్రజ్యోతి (30-11-2019):

ప్రశ్న: మావారు గత రెండు నెలలుగా డైటింగ్‌ చేస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మానేసి బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ తాగుతున్నారు. లంచ్‌, డిన్నర్‌ నార్మల్‌గా చేస్తున్నారు. నాలుగు కిలోల బరువు తగ్గారు కానీ ఎనర్జిటిక్‌గా అనిపించడం లేదు... ఏం చేయమంటారు? ఇలాగే ఫాలో అవ్వొచ్చా? అసలు బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ మంచిదేనా?

- జ్యోతి, హైదరాబాద్‌

 
సమాధానం: బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీలో కాఫీ డికాక్షన్‌, బట్టర్‌, ఎంసీటీ ఆయిల్‌ కలిపి ఉంటాయి. ఇది అచ్చు కాఫీలాగే ఉంటుంది. సాధారణంగా ఈ కాఫీని బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా తీసుకుంటారు. కీటోజెనిక్‌ డైట్‌లో ఉపయోగిస్తారు. ఈ కాఫీ కేవలం క్యాలరీస్‌ మాత్రమే ఇస్తుంది. రెగ్యులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ల్లాగా అన్ని పోషక విలువలు కలిగి ఉండదు. అందువల్ల ఎక్కువ కాలం తాగొద్దు. పైగా మొత్తం డైట్‌, అంటే లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌... ఇవన్నీ కూడా కీటోజెనిక్‌గా ఉంటే మీకు కావాల్సిన ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత, సాధారణ, మోతాదు మించని డైట్‌తో తగ్గిన బరువును కాపాడుకుంటూ ఉండాలి. తరచూ బుల్లెట్‌ప్రూఫ్‌ కాఫీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశాలుంటాయి. సరైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. మీరు చేయాల్సింది ఏమంటే అంతేస్థాయిలో క్యాలరీలను ఇచ్చే నార్మల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తినడం. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు పోషకాల లోపం కూడా ఉండదు. సొంతంగా కాకుండా పోషకాహార నిపుణులను సంప్రదించి, ఏ డైట్‌ ఫాలో అయితే మీ ఆరోగ్యం బాగుంటుందో తెలుసుకుని అది చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. 
 
- డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌