అజీర్తా..? ఆకలి తగ్గిందా..?

11-06-2019: ‘ఆకలి తగ్గిందీ అంటే, ఆరోగ్యం తగ్గిందీ అని అర్థం!’ అంటూ ఉంటారు. ఆకలి తగ్గడం (అగ్ని మాంద్యం) అంటే అందుకు అవసరమైన జఠరాగ్ని తగ్గడం, జీర్ణ రసాలు ఉత్పన్నం కాకపోవడం. ఇవన్నీ అంతిమంగా జీవక్రియలన్నీ కుంటుపడేలా చేస్తాయి ఫలితంగా శరీరం నిర్జీవంగా మారిపోతుంది. అజీర్తి వ్యాధిలో ఆకలి తగ్గడంతో పాటు అతిగా లాలాజలం ఊరడం, పులితేన్పులు, కడుపంతా భారంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ వెంటనే, అంటే, సమస్య తొలిదశలో ఉన్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నా చాలు... జఠరాగ్ని పెరిగి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అందుకు కొన్ని రకాల ఏక మూలికా ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి.
 
2 గ్రాముల శొంఠిచూర్ణాన్ని అరకప్పు గోరు వెచ్చని నీటితో సేవిస్తే అగ్నిమాంద్యం తొలగి ఆకలి మొదలవుతుంది.
5 గ్రాముల అల్లంలో తగినంత ఉప్పు బెల్లం కలిపి, ఉదయం, రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
3 గ్రాముల కరక్కాయ చూర్ణంలో ఉప్పు, బెల్లం తగినంత కలిపి పగలూ రాత్రీ తీసుకుంటే స్వల్ప వ్యవధిలోనే అగ్ని మాంద్యం తగ్గుతుంది.
వ్యాధి తీవ్రతను అనుసరించి 10 నుంచి 15 మి.లీ నిమ్మరసాన్ని రోజుకు మూడు సార్లు భోజనంతో పాటే తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
అగ్ని మాంద్య నివారణకు ...
నిమ్మకాయను సగంగా కోసి, దానిపై 1 గ్రాము మిరియాల పొడి, గ్రాము ఉప్పు ఉంచి, దాన్ని వేడి చేయగా వచ్చిన రసాన్ని భోజనంతో రోజుకు రెండు మూడు సార్లు సేవించాలి. లేదా...
పిప్పలి చూర్ణం గ్రాము, ఉప్పు ఒక గ్రాము నిమ్మరసంతో రోజుకు రెండు సార్లు భోజనంతో తీసుకోవాలి.
సమపాళ్లల్లో కరక్కాయ చూర్ణం, శొంఠి, సైంధవ లవణం చూర్ణాలను తీసుకుని, ఒక భాగం బెల్లంతో కలిపి రోజుకు 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.