లైఫ్‌స్టయిల్‌లో మార్పులు ఎలా చేయాలి

29-06-2019: ఆహారంతో పాటు లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అసలు ఆహారంలో మార్పులు, లైఫ్‌స్టయిల్‌ మార్పులు ఏమిటి? ఎలా చేయాలి?
-వాసంతి

ఆహారం, జీవనవిధానమనేది తప్పకుండా బాడీ కంపోజిషన్‌ మీద ప్రభావం చూపుతుంది. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా బాడీ కంపోజిషన్‌ అనేది తప్పకుండా మనం తీసుకునే ఆహారం, జీవన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. లైఫ్‌స్టయిల్‌లో వచ్చిన మార్పుల వల్ల, శరీరం వయసు, అసలు వయసుకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నవారికి బాడీఫ్యాట్‌ ఎక్కువగా ఉంటుంది. వారు చూడటానికి సన్నగా ఉన్నా సరే. ఆహారం, లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేస్తే ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. ముఖ్యంగా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి...

ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారం కంపోజిషన్‌ మార్చాలి. పండ్లు, కాయగూరలు చేర్చాలి.
ఏ ఆహారమైన మంచిది అంటే అతిగా తినకండి. అతిగా ఏది తిన్నా చివరికి కొవ్వుగా మారుతుంది.
కొవ్వు పదార్థాలను నియంత్రించండి.
బిస్కెట్లు, కేకుల వంటి ఆహారపదార్థాల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉంటాయి. అందుకే పూర్తిగా మానేయండి లేదా నియంత్రించుకోండి.
అతిగా పంచదార, బెల్లం, తేనె తీసుకోరాదు.
జీవనశైలిలో మార్పులు ఇలా...
సమయానికి తినండి. ఆలస్యం అవుతుంటే ఏదో ఒక పండు లేక నట్స్‌ తీసుకోండి. అంతేగానీ టీ, కాఫీలతో పోస్ట్‌పోన్‌ చేయకండి. అలా చేయడం వల్ల అల్సర్స్‌ మొదలవుతాయి.
రాత్రి 11 గంటలు దాటకుండా నిద్రపోండి. నిద్రలో శరీరం రిపేర్‌ అవుతుంది. ఆలస్యంగా నిద్రపోతే రిపేర్‌కు అవకాశం తగ్గుతుంది. పైగా పొట్ట దగ్గర కొవ్వు చేరుతుంది. ఈ జీవనవిధానం అన్నింటికంటే ముఖ్యమైనది.
ఉదయం 8 గంటలకల్లా టిఫిన్‌ చేయాలి. దానివల్ల శరీరం ఆ రోజు శ్రమకు సిద్ధమవుతుంది.
సాయంత్రం 4 నుంచి 6 గంటలదాకా ఎక్కువ ఆకలి వేస్తుంది. కొందరు స్నేహితులతో కలిసి స్నాక్స్‌, ఆల్కహాల్‌ తీసుకుంటుంటారు. ఈ అలవాటు నుంచి బయటపడాలి. సాయంత్రం 6 గంటలకల్లా భోజనం చేసేయండి. ఆ తర్వాత స్నాక్స్‌, ఆల్కహాల్‌ తీసుకున్నా తక్కువ మోతాదు అవుతుంది.
నేటి లైఫ్‌స్టయిల్‌లో శారీరక శ్రమ చాలా తక్కువయ్యింది. కండరాలు యాక్టివ్‌గా ఉండాలంటే శ్రమ అవసరం. ప్రతిరోజూ గుంజీలు తియ్యడం, రన్నింగ్‌, జాగింగ్‌ చెయ్యడం తప్పనిసరి.
సమతుల ఆహారం, నిద్ర, శారీరక శ్రమ.. ఈ మూడు మీ దినచర్యలో భాగం కానివ్వండి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ఆలోచనలతో ఉంటే మంచిది.