కాల్షియం అవసరం ఎంత

ఆంధ్రజ్యోతి,12-9-2016:30 ఏళ్లు దాటితే కాల్షియం సప్లిమెంట్‌ మొదలుపెట్టాల్సిందేనని అంటూ ఉంటారు. పెద్ద వయసులో ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే కాల్షియం సప్లిమెంట్‌ తీసుకోక తప్పదని మన నమ్మకం. కానీ కాల్షియం సప్లిమెంట్లు రెండంచుల పదునున్న కత్తిలాంటివి. వీటి వాడకంలో అప్రమత్తత ఎంతో అవసరం.

19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలంటున్నారు వైద్యులు. వైద్యులు చెప్పకపోయినా కాల్షియం సప్లిమెంట్లను వాడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురికాక తప్పదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించి కాల్షియం శరీరంలో చేరటం వల్ల కిడ్నీలో రాళ్లు, మిల్క్‌ ఆల్కలై సిండ్రోమ్‌లాంటి రుగ్మతలతోపాటు శరీరం ఐరన్‌ను పీల్చుకునే స్వభావాన్ని కుంటుపరుస్తుంది. అలాగే ఇతరత్రా వ్యాధులకు వాడే మందుల మీద కూడా ప్రభావం పడుతుంది. ఆహారం ద్వారా శరీరంలోకి ఎంత కాల్షియం చేరుతుందో గమనించి లోపించిన కాల్షియంను మాత్రల ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేయాలేగానీ చేతికందిన సప్లిమెంట్‌ను తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎముకల నొప్పులు, నీరసం లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన మోతాదు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి.