ఆరోగ్య ఉసిరి.. కేన్సర్‌ను నిరోధించే పాలీఫినాల్స్‌ కూడా..

 

ఆంధ్రజ్యోతి (23-11-2019):ఉసిరి ‘సి’ విటమిన్‌ నిధి. అందుకే దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైరల్‌, బాక్టీరియల్‌ జబ్బులు సైతం రాకుండా ఉసిరి నిరోధిస్తుంది. వీటిల్లో అనేక పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు... కేన్సర్‌ను నిరోధించే పాలీఫినాల్స్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉసిరి వల్ల పొందే కొన్ని ఆరోగ్య లాభాలు ఏమిటంటే...
 
ఉసిరి జలుబును, గొంతునొప్పిని తగ్గిస్తుంది. రెండు టీస్పూన్లు ఉసిరి పొడిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ మూడు లేదా నాలుగు పర్యాయాలు తాగితే దగ్గు, జలుబుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాటరాక్టు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరిలోని ఒక ప్రొటీన్‌ క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. అందుకే అన్నం తినే ముందర ఒక గ్లాసుడు ఉసిరి జ్యూసు తాగితే కడుపు నిండినట్టయి అన్నం తక్కువగా తింటాం. ఉసిరి వల్ల జీవక్రియ బాగా పనిచేస్తుంది. బరువు తగ్గుతారు. అంతేకాదు ఉసిరిలో పీచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
 
ఉసిరి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌ గ్లూకోజ్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది. ఉసిరి జ్యూసు రోజూ తాగితే మంచిది. ముఖ్యంగా రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు ఉసిరి జ్యూసు తాగడం వల్ల వెంటనే నియంత్రణలోకి వస్తుంది.
 
ఉసిరిలో రోగనిరోధకశక్తి గుణం బాగా ఉంది. అంతేగాక ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కూడా.
 
చర్మ సౌందర్యాన్ని మెరుగులీనేలా చేస్తుంది.
 
నల్లటి కురులకు ఆమ్లా సంజీవని. కరివేపాకు మల్లే ఇది కూడా వెంట్రుకలకు బలమైన టానిక్‌లాంటిది. జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంతోపాటు వెంట్రుకలు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. పైగా నేచురల్‌ కండిషనర్‌ కూడా అయిన ఉసిరి శిరోజాలను మృదువుగా, పట్టులా ఉంచుతుంది.
 
ఆర్థరైటిస్‌ సంబంధిత నొప్పులను తగ్గిస్తుంది. నోటి అల్సర్లను కూడా నివారిస్తుంది. నోటిలో పుండ్లు ఏర్పడితే ఒక కప్పులో కొద్దిగా ఉసిరి రసం, నీళ్లు కలిపి పలచగా చేసి ఆ నీళ్లను నోటిలో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
ఉసిరి యాంటీ-ఏజింగ్‌గా కూడా పనిచేస్తుంది.