వయసు 13 ఏళ్లు.. అస్సలు తినడు..ఎలా?

ప్రశ్న: మా అబ్బాయికి పదమూడేళ్లు. ఇప్పటికీ అన్నం తినడానికి పేచీనే. తను ఇష్టంగా తినేందుకు ఏదైనా మార్గం ఉందా?

- నరేందర్‌ రెడ్డి, తూప్రాన్‌ 
 
డాక్టర్ సమాధానం: టీనేజీ పిల్లలు ఇంట్లో వండిన ఆహారం పట్ల ఆసక్తి చూపకపోవడం మామూలే. స్కూల్‌కి, కాలేజీలకు వెళ్లేప్పుడు, పరీక్షలప్పుడు తిండి మీద శ్రద్ధపెట్టరు. అందుకే ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకుండా, తేలికగా ఉండే స్నాక్స్‌  ఇవ్వడం మంచిది. పళ్ళు, గుడ్లు, పాలు, పెరుగు మొదలైనవి ఎప్పుడైనా ఇవ్వొచ్చు. బళ్లో తినేందుకు బాదం, వాల్నట్‌, పిస్తా, వేరుశెనగ లాంటివి పెట్టండి. ఇంటి భోజనంలో ఆకుకూరలు, పప్పు, చేపలు, చికెన్‌ లాంటివి ఉండేలా చూడండి. చదువులో చురుకుగా, ఉత్సాహంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. అన్నం తింటేనే శక్తి వస్తుందని అనుకోవడం అపోహే. కొద్ది మొత్తంలో అన్నం తిన్నా, మిగిలిన పోషకాహారమూ సరిగ్గా తీసుకోవాలి. చాక్‌లెట్లు, స్వీట్లు, చిప్స్‌ లాంటి చిరుతిళ్ల వల్ల ఆకలి వేయదు. కాబట్టి వాటిని మానిపించడం లేదా తక్కువగా తీసుకునేలా చూడడం ఉత్తమం. 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected] కు పంపవచ్చు)