ఇవి తింటే కష్టమే!

ఆంధ్రజ్యోతి, 28/01/2014: సెక్స్‌ జీవితం పది కాలాల పాటు హాయిగా సాగిపోవాలంటే ఏవి తినాలో తెలుసుకునే ముందు ఏవి తినకూడదో కూడా తెలుసుకోవడం మంచిది. లైంగిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా హాయిగా, జోరుగా సాగిపోవాలనుకుంటున్నారా? అందుకు ఏం తినాలో తెలిసినా తెలియకపోయినా, ఏవి తినకూడదో మాత్రం తప్పనిసరిగా తెలుసుకోండి. జీడిపప్పులు, బాదంపప్పుల వంటివి లైంగిక జీవితానికి పదను పెడతాయని అందరికీ తెలుసు. కానీ, ఓ పది పదిహేను పదార్థాలు తినడం వల్ల, సెక్స్‌ జీవితం సర్వనాశనమైపోతుందని, ఆ ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయడమే మంచిదని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో పునరుత్పత్తి విభాగానికి అధిపతిగా పనిచేస్తూ, సెక్స్‌ జీవితాన్ని దెబ్బ తీసే ఆహార పదార్ధాలపై మూడేళ్ల పాటు విశేషంగా కృషి చేసి, గత డిసెంబర్‌లో వాటి ఫలితాలను ‘హెల్త్‌’ జర్నల్‌లో ప్రచురించిన డాక్టర్‌ జాన్‌ క్రిస్టఫర్‌ కృత్రిమమైన స్వీటనెర్స్‌ శరీరానికి తీరని హాని కలిగిస్తాయనే వాక్యంతో తన పరిశోధక వ్యాసాన్ని ప్రారంభించారు. ఈ స్వీటెనర్స్‌లో ఉండే ఆస్పర్టేమ్‌ అనే మూలకం శరీరంలో ఉండే నెరొటోనిన్‌ అనే ఆనందదాయక హార్మోన్‌ క్షీణించిపోయేలా చేస్తుందట. అసలు సెక్స్‌ యావే కలగకపోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
 
కృత్రిమమైన స్వీటెనర్స్‌ను కొనడానికి బదులు, తేనెనో, బెల్లాన్నో కొనుక్కోవడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. ఇవి రెండూ సెక్స్‌ జీవితాన్ని పొడిగిస్తూ పోవడంతో పాటు, సెక్స్‌ యావను బాగా పెంచేస్తాయని, శరీరంలో నీరసం, నిస్సత్తువ వంటివి ఏర్పడకుండా తేనె, బెల్లం ఉపయోగపడినంతగా గ్లూకోస్‌ కూడా ఉపయోగపడదని ఆయన చెబుతున్నారు. ఇవి మార్కెట్‌లో అతి తక్కువ ధరకు లభించే అతి శక్తివంతమైన వాజీకరణాలని ఆయన ద్రువీకరించారు.
 
లైంగిక జీవితాన్ని చక్కగా అనుభవించదలచుకున్నవారు మొక్కజొన్న కండెలు తినడాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదట. సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గడం కోసమే డాక్టర్‌ జాన్‌ హార్వీ కెలాగ్‌ అనే పెద్ద మనిషి మొక్కజొన్న గింజల ప్యాకెట్లను అమ్మే వ్యాపారంలోకి దిగారన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొక్కజొన్న గింజలను వేయించుకుని పాప్‌కార్న్‌ పేరుతో చాలామంది తింటుంటారు. ఇది సెక్స్‌ జీవితానికి ఉపయోగపడడం లేదని, లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తోందని డాక్టర్‌ క్రిస్టఫర్‌ చెప్పారు.అందువల్ల పడక గదిలో పాప్‌కార్న్‌ను, కార్న్‌ఫ్లేక్స్‌ను పొరపాటున కూడా ఉపయోగించవద్దని, వాటిని నోట్లోకి ఎగరేసుకుంటూ ఎంజాయ్‌ చేద్దామన్న ఆలోచన మొదటికే మోసం తెస్తుందని కూడా ఆయన తెలిపారు.
 
నకిలీలతో జాగ్రత్త 
మార్కెట్‌లో ఇప్పుడు లభ్యమవుతున్న అనేక పాల ఉత్పత్తులు నకిలీవేనని ఆయన హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసి అమ్ముతున్న చీజ్‌ తింటే సెక్స్‌ జీవితం గురించి, అందులోని ఆనందం గురించి ఇక మరచిపోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈ చీజ్‌ సెక్స్‌ జీవితాన్నే కాక, శరీరాన్ని కూడా దెబ్బ తీస్తుందట. ఈ చీజ్‌ వల్ల శరీరంలో కొన్ని రకాల విష పదార్థాలు ఉత్పత్తయి, సెక్స్‌ జీవితానికి ఉపయోగపడే ఈస్ర్టోజెన్‌, ప్రొజెస్టరాన్‌, టెస్టోస్టెరాన్‌ వంటి హార్మోన్లను నాశనం చేస్తాయి. శరీరంలో ఇటువంటి విష పదార్థాలు చేరితే, ఒక్కోసారి నపుంసకత్వం కూడా దాపురిస్తుందని ఆయన చెప్పారు.
 
శరీరంలోని కణాలను సర్వనాశనం చేయగల చిప్స్‌కు సెక్స్‌ సంబంధమైన కణాలు, నరాలను దెబ్బ తీయడం పెద్ద లెక్కలోనిది కాదని ఆయన చెప్పారు. ఈ రకం చిప్స్‌ను రకరకాల నూనెలతో, అత్యధిక ఉష్ణోగ్రతలో తయారు చేస్తారు. ఇందులోని కొవ్వు పదార్థాలు, అధిక ఉష్ణోగ్రత అతి వేగంగా సెక్స్‌ జీవితాన్ని పాడు చేస్తాయి. అసలు సెక్స్‌ మూడ్‌ లేదా యావ కలగకపోవడానికి కూడా అవకాశం ఉంది.
 
ఉదయమే లేచి, ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగితే ప్రాణానికి హాయిగా ఉంటుంది. కానీ, దీని రెండో పార్శ్వాన్ని కూడా చూడండి. ఉదయమే ఒకటికి రెండుసార్లు కాఫీ తాగితే, ఇక ఆ రాత్రికి మూడ్‌ ఉండదుట. కాఫీ వల్ల కార్టిసోల్‌ వంటి ఒత్తిడి సంబంధమైన హార్మోన్లు చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇక రాత్రయ్యే సరికి కాఫీ తాలూకు దుష్ప్రభావం విశ్వరూపం దాలుస్తుంది. చిరాకు, అసహనం, గుండె వేగంగా కొట్టుకోవడం, కోపం ఎక్కువ కావడం, బీపీ పెరగడం వంటి చిహ్నాలు శరీరాన్ని, మనసును బాధిస్తాయి. ఇక రొమాన్స్‌కు, ప్రేమకు మనసు, శరీరం సహకరించవు. అందువల్ల మీరే కాదు, మీ జీవిత భాగస్వామి కూడా ఎక్కువసార్లు కాఫీ తీసుకోకపోవడం సెక్స్‌ జీవితానికి చాలా మంచిది.
 
ఓ ఆహార పదార్థంగా సోయా మాంసాహారం కంటే మంచిదే. అయితే, సెక్స్‌ జీవితానికి మాత్రం ఇది ఏ విధంగానూ మంచిది కాదట. ఇందులో ఉండే ఫైటోఎస్ర్టోజెన్‌ మూలకం పురుషుల్లోని సెక్స్‌ హార్మోన్లను దెబ్బ తీస్తాయి. ఇది పుంసత్వాన్ని బలహానపరచడమే కాక, పునరుత్పత్తి సత్తాను కూడా గణనీయంగా తగ్గించేస్తుంది. సోయాను తరచూ తినడం వల్ల పురుషుల్లో సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని ఆయన వివరించారు.
 
ఇక తరచూ సోడాలు తాగడం వల్ల, శీతల పానీయాలు తాగడం వల్ల కూడా సెక్స్‌ పటుత్వం దెబ్బ తింటుంది. ఇవి శరీరంలోనే కాక, మూడ్‌లో కూడా హెచ్చుతగ్గుల్ని కలిగిస్తుంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యం పక్కదారి పట్టి సెక్స్‌ జీవితం క్షీణించడం ప్రారంభిస్తుంది. నోరు తియ్యగా ఉండడమే కాకుండా, సువాసనలు వెదజల్లడానికి నోట్లో వేసుకుని చప్పరించే కొన్ని రకాల బిళ్లలు, స్వీట్లు శరీరానికి తీరని హాని కలిగిస్తాయని, వాటి వల్ల సెక్స్‌ పటుత్వానికి కూడా ప్రమాదం ముంచుకొస్తుందని క్రిస్టఫర్‌ చెబుతున్నారు.
 
వేపుళ్లు వద్దు 
ఇటువంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల వీటిలోని మెంథాల్‌ కారణంగా నోటి దుర్వాసన నుంచి తాత్కాలికంగా విముక్తి లభించవచ్చేమో కానీ, సెక్స్‌ పటుత్వం మీద మాత్రం ఇవి దుష్ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. అందువల్ల ఇతర మందులతో నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. ఇక మద్యం గురించి, ధూమపానం గురించి చెప్పనే అక్కర లేదు. ఇవి సెక్స్‌ పటుత్వానే కాక, పునరుత్పత్తి వ్యవస్థను కూడా బాగా దెబ్బతీస్తాయన్న సంగతి తెలిసిందే. వేపుడు కూరలు, నూనె పదార్థాలు కూడా సెక్స్‌ జీవితాన్ని దుర్భరం చేస్తాయని క్రిస్టఫర్‌ చెబుతున్నారు. ఇందులోని కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు టెస్టోస్టెరాన్‌ స్థాయిని బాగా తగ్గించివేస్తాయి. పురుషుల్లో వీర్య కణాలను చంపేస్తాయి. రొమాంటిక్‌ భావాలు కూడా సన్నగిలిపోతాయి. శృంగారభరిత జీవితం సక్రమంగా, సజావుగా ముందుకు సాగాలంటే తప్పనిసరిగా ఈ పదార్థాలకు దూరంగా ఉండక తప్పదు.