నిద్రలేమితో జలుబా?

30-07-2019: ‘‘మందులు వేసుకుంటే 7 రోజుల్లో, వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గిపోతుంది’’ అంటూ జలుబును ఒక అంతుచిక్కని వ్యాధిగా చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. నిజానికి, జలుబు చేయడానికి 350 రకాల వైరస్‌, బ్యాక్టీరియాలు కారణమవుతాయి. వీటికి మందు తయారు చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఈ వైరస్‌, బ్యాక్టీరియాలు ఏటేటా తమ స్వరూప స్వభావాలను మార్చేసుకుంటాయి. అందువల్ల ఈ సంవత్సరం తయారు చేసిన ఒక మందు మరుసటి సంవత్సరం పనికి రాదు. అందువల్ల జలుబు సంబంధించిన బాధలనుంచి ఉపవమనం కలిగించే మందులనే తప్ప ఆ వైరస్‌, బ్యాక్టీరియాను అంతమొందించే మందులను ఎవరూ తయారు చేయడం లేదు. అందుకే వచ్చిన జబ్బును భరించాల్సిందే అనే మాటే పరోక్షంగా వినపడుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వైరస్‌, బ్యాక్టీరియాలు దాడి చేస్తాయి. అసలు వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అనే విషయానికి వస్తే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో నిద్రలేమి కూడా ఒక బలమైన కారణమేనని ఇటీవలి అధ్యయనాల్లో స్పష్టమయ్యింది.
 
రోజుకు 7 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే 5 నుంచి 6 గంటలు నిద్రించే వారు ఎక్కువ సార్లు .జలుబుకు గురవుతున్నట్లు, 5 గంటల కన్నా తక్కువగా నిద్రించే వారు, మిగతా వారికన్నా నాలుగు రెట్లు తీవ్రంగా జలుబు బారిన పడుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. అందుకే పెద్దలు కనీసం 7 గంటలైనా నిద్రించాలని, పిల్లలు, టీనేజ్‌ వాళ్లు 8 గంటల కన్నా ఎక్కువే నిద్రించాలని నేష్నల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ వారు సూచిస్తున్నారు. మొత్తానికి జలుబు చేయడానికి నిద్రలేమి కూడా ఒక కారణమేననే ఒక కొత్త నిజం ఇప్పుడు వెలుగు చూసింది.