ఇదేమి బిర్యానీ.. బాప్‌రే పరేషానీ!

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు అంతంతమాత్రమే 


(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ):హైదరాబాద్‌ బిర్యానీకి ప్రపంచ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును కొందరు చెడగొడుతున్నారు. కుళ్లిన మటన, చికెన్, కల్తీ నూనెలతో బిర్యానీని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క బిర్యానీ మాత్రమే కాదు.. నగరంలోని చాలా హోటళ్లలో అన్ని రకాల ఆహార పదార్థాలదీ అదే దుస్థితి. అయినా జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లలో చలనం లేదు. తక్కువ సిబ్బంది ఉన్నారని అధికారులు సాకు చెబుతున్నా.. ఉన్న నలుగురూ సక్రమంగా తనిఖీలు చేయడం లేదు. ఒక్కొక్కరు నెలకు కనీసం 12 హోటళ్లు తనిఖీ చేయాలని నిబంధనలున్నా.. సగం కూడా పరిశీలించడం లేదు. బిర్యానీలో కుళ్లిన మాంసం వినియోగిస్తున్నారని తాజాగా మల్కాజ్‌గిరిలో బయటపడడంతో నగర హోటళ్లలోని ఆహార నాణ్యత చర్చనీయాంశంగా మారింది.
 
బిజీగా మారిన నగర జీవితంలో భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే కానీ బతికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇంటి వంట కంటే బయటి ఆహారంపైనే కొన్ని కుటుంబాలు ఆధార పడుతున్నాయి. ఓ అధ్యయన నివేదిక ప్రకారం గ్రేటర్‌లోని దాదాపు 50 శాతం మంది నిత్యం ఏదో ఒక సమయంలో బయటి ఆహారం తింటున్నారు. రోడ్డు పక్కనుండే బజ్జీల బండి నుంచి త్రీ, ఫైవ్‌, సెవన్‌ స్టార్‌ హోటళ్ల వరకు ఆర్థిక స్థోమతను బట్టి నచ్చింది ఆరగించేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంగతి సరేసరి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారూ హైదరాబాద్‌కు వస్తే బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. బయటి ఆహారం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా... జిహ్వాచాపల్యం ఆ ప్రమాదాన్ని గుర్తించకుండా చేస్తోంది. మరి మనం బయట తింటున్న ఆహారం ఎంత వరకు సురక్షితం..? శుచి, శుభ్రత ఉంటే చాలా..? ఎలాంటి వస్తువులతో తయారు చేస్తున్నారు.? ఏం వినియోగిస్తున్నారు..? అన్నది ఒక్కసారి ఆలోచిస్తే బయట తినే సాహసం చేయరంటున్నారు వైద్యులు. అన్ని హోటళ్లూ కల్తీ వస్తువులు వాడకున్నా.. మెజార్టీ చోట్ల అదే పరిస్థితి. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు హానికరంగా మారుతున్నాయి. వారం, పది రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరిలోని గ్రీన్‌ బావర్చి హోటల్‌లో తనిఖీలకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ వైద్య విభాగం అధికారులు అక్కడి మాంసాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బిర్యానీ తయారీకి వినియోగించే మాంసం కుళ్లి దుర్వాసన వస్తుండడంతో వాంతికి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. సాధారణ హోటళ్లే కాదు.. అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులున్న సంస్థలు విక్రయించే ఆహారంలోనూ సాల్మోనెల్లా, ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని గతంలో ఎస్‌ఎ్‌ఫఎల్‌ పరీక్షల్లో తేలింది.
 
తనిఖీలేవి..? 
హోటళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు..? నాణ్యత ఎలా ఉంది..? ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందా..? అన్నది పరిశీలించే వారు కరువయ్యారు. దీంతో వండిందే వంట.. వేసినవే వస్తువులు అన్నట్టు హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రుచి పేరిట రసాయనాలతో కూడిన వస్తువులు వినియోగించడం.. అల్సర్‌, అధిక బరువు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు దారి తీస్తున్నాయి. రసాయనాలున్న ఆహారం తింటే కేన్సర్‌ సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అనుమానం వస్తేఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపాలి. అనారోగ్యకర ఆహారం విక్రయిస్తున్నట్లు నివేదికలో తేలితే... ఆయా సంస్థలకు జరిమానా విధించాలి. హోటల్‌ను సీజ్‌ చేసే అధికారమూ జీహెచ్‌ఎంసీకి ఉంటుంది. అయితే ఎక్కడా తనిఖీలు కనిపించడం లేదు. 90 లక్షల జనాభా ఉన్న నగరంలో దాదాపు 19వేల వరకు అనుమతి ఉన్న ఆహార విక్రయ సంస్థలున్నాయి.. అనధికారికంగా 15 వేల వరకు ఉన్నట్టు అంచనా. వీటిని తనిఖీ చేసేందుకు నిబంధనల ప్రకారం కనీసం 30 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. కానీ జీహెచ్‌ఎంసీలో ఉన్నది మాత్రం కేవలం నలుగురు మాత్రమే. ఒక్కో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలకు కనీసం 12 హోటళ్లు తనిఖీ చేయాలన్నది నిబంధన. అది కూడా జరగడం లేదు. ఆ నలుగురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నామ్‌ కే వాస్తేగా మారారు. కొందరు నెలనెలా మామూళ్లకు ఆశపడి కొన్ని హోటళ్లలో కల్తీ ఆహారం విక్రయిస్తున్నారని ఫిర్యాదు వచ్చినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి.
 
అది వాస్తవమే : రవికిరణ్‌, అదనపు కమిషనర్‌, ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణ 
ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తక్కువగా ఉన్నారన్నది వాస్తవం. అందుకే పూర్తిస్థాయిలో హోటళ్లలో తనిఖీలు జరగడం లేదు. ఉన్నంతలో వీలైనన్ని ఎక్కువ హోటళ్లను పరిశీలిస్తున్నాం. గ్రేటర్‌లో 30 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. ప్రస్తుతం నలుగురు ఉన్నారు. మరో 26 మందిని కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. త్వరలో స్పష్టత వస్తుందని భావిస్తున్నాం. 
 
 
నిర్ణీత ఉష్ణోగ్రత ఉండాల్సిందే : డాక్టర్‌ జానకి, న్యూట్రీషియనిస్ట్‌ 
ఆహారం నిల్వ చేసినా.. ఉడికించినా.. నిర్ణీత సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత మెయింటెయిన్‌ చేయాలి. హోటళ్లలో మొదట ఆహార పదార్థాలను ఉడికించి.. ఆర్డర్‌ వచ్చిన తర్వాత వేడి చేసి సర్వ్‌ చేస్తున్నారు. ఉడికించి చల్లార్చిన ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా విస్తరించే అవకాశముంటుంది. చల్లారాక వేడి చేసినప్పుడు.. ప్రతి ముక్కా పూర్తిగా వేడిగా అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. మాంసం తరిగిన కత్తితో కూరగాయలు కోయకూడదు. రిఫ్రిజిరేటర్‌లో పెట్టినా శాఖాహార, మాంసాహార పదార్థాలు వేర్వేరుగా నిల్వ ఉంచాలి. పోషకాలు ఎక్కువ ఉండే పాలు, మంసాహార పదార్థాలకు బ్యాక్టీరియా ఎక్కువగా ఆకర్షితమవుతుంది. అందుకే బయటి ఆహారంతో ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటివి జరుగుతాయి.