సీజన్‌కు తగ్గ ఫుడ్‌!

(ఆంధ్రజ్యోతి, 05-12-2019): 

ఈ సీజన్‌లో తడి, వేడి గాలులు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. పెదాలు పగులుతాయి. ముఖం పాలిపోయినట్టు కనిపిస్తుంది. అయితే బ్యూటీ ఉత్పత్తులు వాడినప్పటికీ చర్మానికి తగినంత తేమ అందనప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
 
గ్రీన్‌ టీ: దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషపదార్ధాలు, ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. చర్మం మీది ముడతలు, గీతలు తగ్గిపోయేలా చేసి చర్మానికి కాంతిని, తాజాదనాన్ని తెస్తాయి.
 
బాదం: వీటిలో విటమిన్‌ ఇ అధికమొత్తంలో ఉంటుంది. ఇది చర్మాన్ని అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. బాదంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
 
బ్రకోలి: దీనిలోని విటమిన్‌ ఎ, విటమిన్‌ సి చర్మం మీది మచ్చల్ని మాయం చేస్తాయి. విటమిన్‌ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. బ్రకోలిలోని విటమిన్‌ బి చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడాన్ని నివారిస్తుంది.
 
పాలకూర: ఈ ఆకుకూరలో ఐరన్‌ లభిస్తుంది. ఇది రక్తహీనతను తగ్గించడమే కాదు చర్మానికి నిగారింపును ఇస్తుంది. పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తాయి.