ఎప్పుడూ అనారోగ్యమే.. ఏ ఆహారం ఇవ్వాలి..?

ప్రశ్న: మా స్నేహితుడి కొడుక్కి పదిహేను నెలలు. తల్లిపాలు పడక, పోతపాలే పడుతున్నారు. ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటాడు. బాబుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

- రాజేష్‌ కుమార్‌, యర్రగుంట్ల 
 
డాక్టర్ సమాధానం: ఆరు నెలలు నిండాక పిల్లలకు పాలతోపాటు ఘనాహారం ఇవ్వాలి. ఏడాది వయసు దాటేసరికి... పిల్లలకు ఘనాహారం అలవాటు చేసి అయిదారు నెలలు అవుతుంది కాబట్టి, ఇంట్లో వండుకునే ఆహారంలో ఒకట్రెండు మినహా అన్నీ ఇవ్వవచ్చు. వండిన ఆహారాన్ని చేత్తో లేదా స్పూనుతో నలిపి మెత్తగా చేసి ఇవ్వండి. మిక్సీలో వేసి పేస్ట్‌చేసి ఇస్తే రుచి మారుతుంది. పిల్లలు ఆ ఆహారాన్ని ఇష్టపడక పోవచ్చు. మెత్తగా ఉండే పండ్లను చేత్తో నలిపి పెట్టండి. అలాగే వండిన కూరగాయలూ ఇవ్వొచ్చు. బియ్యం, కంది లేదా పెసర పప్పు, కొద్దిగా బాదం పప్పు కలిపి రవ్వలాగా చేసి పెట్టుకోండి. రోజూ ఆ మిశ్రమాన్ని కాస్త వండుతూ దానికి రసం లేదా నెయ్యి వేసి తినిపించవచ్చు. మాంసాహారం తినేవారైతే బాగా వండిన చికెన్‌ లేదా చేప మెత్తగా నలిపి ఇవ్వండి. ఉడికించిన గుడ్డులోని పచ్చ సొనలో కొంత భాగం అన్నంతో కలిపి పెట్టవచ్చు. ఇలా చేస్తే ఎదుగుదలకు అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. రోగనిరోధక శక్తీ మెరుగవుతుంది. పంచదార, బెల్లం, తేనె; బయటి స్వీట్స్‌, చాక్‌లెట్స్‌, చిప్స్‌, బిస్కెట్స్‌ లాంటివి ఇప్పుడే అలవాటు చెయ్యడం మంచిది కాదు.
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected] కు పంపవచ్చు)