ఏ ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి..?

ఆంధ్రజ్యోతి (03-11-2019):  
ప్రశ్న: యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే ఏమిటి? ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి? వాటి ఉపయోగాలేమిటి?
- రాధిక, తాండూరు
 
సమాధానం: శరీరంలోని జీవప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్‌ తయారవుతాయి. ఇవి ఎక్కువైతే కణాల పనితీరును దెబ్బతీసి అనారోగ్యం పాలు చేస్తాయి. దాంతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్‌, పార్కిన్సన్స్‌ లాంటి సమస్యలు రావచ్చు. ఈ నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. ఇవి రెండు రకాలు.. ప్రాకృతిక మైనవి, కృత్రిమమైనవి. ఆహారం ద్వారా లభించేవి ప్రాకృతిక మైనవి. రంగురంగుల పండ్లు, కూరగాయల్లో ఇవి పుష్కలం. శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. తాజా పండ్లు, సలాడ్లలోని విటమిన్‌- సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. టమాటాలు, పుచ్చకాయల్లోని లైకోపీన్‌ మరొక యాంటీ ఆక్సిడెంట్‌. బియ్యం, గోధుమలు, పప్పులు లాంటి ధాన్యాల్లోని సెలీనియం యాంటీ ఆక్సిడెంటే. వివిధ రంగుల్లోని ఆహారాల్లో ఫ్లేవనాయిడ్స్‌, పాలిఫెనాల్స్‌, కాటెచిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూర గాయలు, ధాన్యాలు తీసుకుంటే అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కృత్రిమ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఉపయోగం ఉన్నా ప్రాకృతికంగా లభించేవే మంచివి. 
 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)