వయసు 19 ఏళ్లే.. కానీ 30 ఏళ్లు దాటిన వాడిలా..

ఆంధ్రజ్యోతి (26-11-2019):

ప్రశ్న: నా వయసు 19 ఏళ్లు. కానీ 30 దాటిన వాడిలా ఉంటాను. నా శరీరం, చర్మం వయసుకు తగినట్టు కనిపించాలంటే ఏం చేయాలి?

- మణి కిశోర్‌
 
డాక్టర్ సమాధానం: అధిక బరువు, ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు, చర్మమూ జుట్టూ కాంతి హీనంగా మారడం, జుట్టు పలచబారడం... తదితర కారణాల వల్ల వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామంతో కూడిన జీవనశైలి ముఖ్యం. పొట్టతగ్గాలంటే పిండిపదార్థాలు, తీపిపదార్థాలు మితంగా తీసుకోవాలి, వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌, బేకరీ ఐటమ్స్‌, కూల్‌ డ్రింక్స్‌ మానుకోవాలి. భోజనంలో అన్నం కంటే, కూరలు, పప్పు, పెరుగు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉప్పు అధికంగా ఉండే ఊరగాయలు, పచ్చళ్ళు బాగా తగ్గించాలి. మీ వయసుకు, జీవనశైలికి అవసరమైనన్ని కెలోరీలు మాత్రమే లభించే ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు తప్పనిసరిగా ఒక కప్పు సలాడ్‌ (పచ్చి కూరగాయ ముక్కలు) తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే జామ, దానిమ్మ, కమలా, ఆపిల్‌, పుచ్చ, బొప్పాయి మొదలైన ఫలాలను తినడం వల్ల చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. ప్రొటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండే బాదం, ఆక్రోటు, పిస్తా వంటి పప్పులు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర, మానసిక ఆందోళన తగ్గించుకోవడం వల్ల కూడా వయసుకు తగ్గట్టు శరీరం కనిపిస్తుంది. మద్యపానం, ధూమపానంలాంటి అలవాట్లు అకాల వృద్ధాప్యాన్ని తెచ్చిపెడతాయి.
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)